తెలుపు, ఖాకీ రంగు దుస్తులు.. చేతిలో లాఠీలతో కార్యకర్తల సందడి మధ్య రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) విజయసంకల్ప శిబిరం ఘనంగా ప్రారంభమైంది. 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి వందేళ్లవుతున్న సందర్భంగా తెలంగాణలోని 10,000 గ్రామాలకు చేరువ కావాలనే వ్యూహంతో ఆర్‌ఎస్‌ఎస్ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం చేపట్టింది.
సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చ
రాష్ట్రం నలుమూలల నుంచి స్వయంసేవకులతో పాటు భాజపా, ఏబీవీపీ, కిసాన్ సంఘ్ నేతలు హాజరయ్యారు. ఈ శిబిరానికి నగర శివారు మంగళ్‌పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాల వేదికైంది. సంఘ్ విస్తరణ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ‘గతి విధులను’ విస్తృతంగా నిర్వహించే విషయంపై చర్చించారు.
8,000 మంది స్వయంసేవకులు
జిల్లాల నుంచి 8,000 మంది స్వయంసేవకులు హాజరయ్యారు. వివిధ క్షేత్రాల రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విచ్చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శులు భాగయ్య, ముకుందాజీ, జాతీయ స్థాయి అధికారులు, క్షేత్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దూసరి రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు దక్షిణామూర్తి, రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్ తదితరులు కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు. శిబిరానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్‌లు పాల్గొన్నారు.