అదీ ఇదీ అని కాదు.. అన్ని రంగాలూ కరోనా ధాటికి నష్టాల పాలయ్యాయి. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూపార్కులను కొవిడ్ కోలుకోలేని దెబ్బతీసింది. అన్‌లాక్ తర్వాత నవంబరు 16 నుంచి తిరుపతి, 17 నుంచి విశాఖ జూ పార్కుల్లోకి సందర్శకుల్ని అనుమతించినా స్పందన కొరవడింది. గతంతో పోలిస్తే 20 శాతం మంది కూడా రావడం లేదు. సందర్శకుల ప్రవేశ రుసుముతో పాటు జంతు ప్రదర్శన శాలల్లోని క్యాంటీన్లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏటా విశాఖ జూకు రూ.5 కోట్లు, తిరుపతి జూకు రూ.6 కోట్లు సమకూరేవి. కరోనా ప్రభావంతో మొత్తానికే ఆదాయం పడిపోయింది.
పొదుపు నిధులే దిక్కు
కొన్నేళ్లుగా వచ్చిన ఆదాయంలో కొంత మేర జూ నిర్వహణకు వెచ్చించి మిగిలిన మొత్తాలను బ్యాంకులో పొదుపు చేసేవారు. అలా తిరుపతి జూ ఖాతాలో రూ.7 కోట్లు, విశాఖ జూ ఖాతాలో రూ.4.7 కోట్లున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి సందర్శకుల్ని నిలిపివేయడంతో ఆదాయం లేక పొదుపు మొత్తాలే దిక్కయ్యాయి. తిరుపతి అధికారులు రూ.5 కోట్లు, విశాఖ అధికారులు రూ.1.90 కోట్లు డ్రా చేసి, వాటితో జంతువులకు ఆహారం, ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు.