తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో భారీగా పెరిగిన వాణిజ్య పన్నుల రాబడులు - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో భారీగా పన్నులు వసూలయ్యాయి. వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఈ ఆర్థిక ఏడాదిలో 52,436.21 కోట్లు రూపాయల మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమైంది. పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్‌ రాబడులు తగ్గినా, మద్యం అమ్మకాలపై వ్యాట్‌ రాబడి 19శాతం వృద్ధి నమోదు చేసింది. కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావాలను అధికమించి వసూళ్లు కావడంతో సగటున పది శాతానికిపైగా వృద్ధి నమోదు చేసింది.

Commercial  tax Collections in Telangana
రాష్ట్రంలో భారీగా పెరిగిన వాణిజ్య పన్నుల రాబడులు.

By

Published : Apr 8, 2021, 4:24 AM IST

Updated : Apr 8, 2021, 9:15 PM IST

వాణిజ్య పన్నుల శాఖ భారీ రాబడులతో ప్రభుత్వ ఖాజానాకు కాసుల వర్షం కురిపించింది. వ్యాట్‌, జీఎస్టీ రాబడుల వసూళ్లపై కరోనా ప్రభావం పడుతుందని మొదట ప్రభుత్వం భావించింది. స్తంభించిన వ్యాపారలావాదేవీలు క్రమంగా పుంజుకోవడంతో వ్యాట్‌, జీఎస్టీ రాబడులు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. గత ఆర్థిక ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌ నెలలో 75శాతం ఆదాయం పడిపోయి కేవలం రూ.932.54 కోట్లు రాబడి వచ్చింది. ఆ తరువాత నెల మేలో 52శాతం ఆదాయం పడిపోగా, జూన్‌ నెలలో 10శాతం వృద్ధి నమోదు చేసినా జులైలో 14శాతం, ఆగస్టులో 8శాతం లెక్కన రాబడుల్లో తరుగుదల నమోదైంది. సెప్టెంబర్ నెల నుంచి పన్నుల వసూళ్లు క్రమంగా ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 18శాతం, అక్టోబరులో రికార్డు స్థాయిలో 58శాతం, నవంబరు నెలలో అత్యధికంగా 77శాతం వృద్ధి నమోదు చేసింది. డిసెంబరులో 27శాతం, జనవరిలో 22శాతం, ఫిబ్రవరిలో 15శాతం, మార్చిలో ఏకంగా 31.22శాతం లెక్కన రాబడుల్లో వృద్ధి నమోదు అయ్యింది. పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్‌ రాబడులు 14శాతం తగ్గగా, మద్యం అమ్మకాలపై వ్యాట్‌ ఆదాయం 19శాతం వృద్ధి నమోదు చేసి అధికారుల ఊహలకంటే ఎక్కువ ఆదాయం తెచ్చి పెట్టింది.

19శాతం వృద్ధి

2019-20 ఆర్థిక ఏడాదిలో వచ్చిన రూ.47,657.86 కోట్లు మొత్తంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.52,436.21 కోట్లు మేర మొత్తం వసూలై సగటున 10.03 శాతం వృద్ధి నమోదు చేసింది. పద్దుల వారీగా రాబడులను పరిశీలించినట్లయితే....పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై గత ఆర్థిక ఏడాదిలో రూ.10,131 కోట్లు రాబడిరాగా, ఈ ఆర్థిక ఏడాది రూ.8,703.67 కోట్లు వసూలై 14శాతం తరుగుదల నమోదు చేసింది. అదేవిధంగా మద్యం అమ్మకాలపై వ్యాట్‌ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం రూ.9,860 కోట్లు రాగా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.11,705 కోట్లు వచ్చి 19శాతం వృద్ధి నమోదు చేసింది. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు, ఐజీఎస్టీ సర్దుబాట్లతో కలిపి గత ఆర్థిక సంవత్సరం రూ.25,404 కోట్లు రాబడి రాగా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.26,544.47 కోట్లు వసూళ్లు అయ్యి కేవలం నాలుగు శాతం వృద్ధి నమోదు చేసింది. అయితే గత ఆర్థిక ఏడాదిలో కేవలం రూ.2,263 కోట్లు జీఎస్టీ పరిహారం రాగా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.5,483.06 కోట్లు పరిహారం కింద రాష్ట్రానికి వచ్చింది.

తీవ్ర ప్రభావం

దేశ వ్యాప్తంగా కరోనా, లాక్‌ డౌన్‌ ప్రభావాలు వ్యాపారలావాదేవీలపై తీవ్రంగాపడ్డాయి. అయినా తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై భారీగా వ్యాట్‌ రాబడులు రావడం, జీఎస్టీ రాబడులు స్వల్పంగా పెరగడం, కేంద్రం నుంచి జీఎస్టీ పరిహారం రెట్టింపు రావడంతో మొత్తం మీద పది శాతానికిపైగా వృద్ధి నమోదు అయినట్లు వాణిజ్య పన్నుల అధికారులు అంచనా వేస్తున్నారు. అదే అయిదు నెలలపాటు రాబడుల్లో తరుగుదల నమోదు కానట్లయితే 60వేల కోట్లుకుపైగా వాణిజ్యపన్నుల రాబడులు వచ్చి ఉండేవని అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి: గ్రామాలపై కరోనా పంజా.. మరో ఊరిలో స్వచ్ఛంద లాక్​డౌన్

Last Updated : Apr 8, 2021, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details