తెలంగాణ

telangana

ETV Bharat / city

'హైదరాబాద్​లో చెరువుల మరమ్మతులకు రూ.50 కోట్లు కావాలి' - జీహెచ్​ఎంసీ చెరువులు తాజా వార్తలు

భాగ్యనగర పరిధిలోని మొత్తం 192 నీటి వనరులను పరిశీలించిన ఇంజినీర్లు.. దెబ్బతిన్న చెరువులు, కుంటలను మరమ్మతు చేయడానికి సుమారు రూ. 50 కోట్లు అవసరమవుతాయని నివేదించారు. మొత్తం 15 మంది సూపరింటెండెంట్‌ ఇంజినీర్లతో కూడిన 15 బృందాలు ఇచ్చిన నివేదికల ప్రకారం తాత్కాలిక మరమ్మతులకు రూ.10 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారు.

Rs. 50 crores for repair of rivers in Hyderabad
'హైదరాబాద్​లో చెరువుల మరమ్మతులకు రూ.50 కోట్లు కావాలి'

By

Published : Oct 27, 2020, 10:23 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కుంటలను మరమ్మతు చేయడానికి సుమారు రూ.50 కోట్లు అవసరమవుతాయని ఇంజినీర్లు నివేదించారు. మొత్తం 192 నీటి వనరులను పరిశీలించిన ఇంజినీర్లు ఆ చెరువులు, కుంటల తూములు, అలుగులు, కట్టలు ఏ స్థితిలో ఉన్నాయో తెలియజేశారు. తాత్కాలిక మరమ్మతుతో సరిపోతుందా లేక పూర్తిగా మార్చాలా అన్నది వివరించారు. ఈ పనులకు ఎంత అవుతుందో అంచనా వేసి నీటిపారుదల శాఖ అధికారులకు అందజేశారు. మొత్తం 15 మంది సూపరింటెండెంట్‌ ఇంజినీర్లతో కూడిన 15 బృందాలు ఇచ్చిన నివేదికల ప్రకారం తాత్కాలిక మరమ్మతులకు రూ.10 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.40 కోట్లు కావాలి.

రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, బండ్లగూడ ప్రాంతంలో 14 చెరువులను పరిశీలించిన బృందం ఒక్కటే రూ.26 కోట్లకు అంచనా వేసింది. చెరువులపై ఈ ప్రకారం నిధులు ఖర్చుచేసినా సమస్య పరిష్కారం అవుతుందా అని 'ఈనాడు- ఈటీవీ భారత్​' ప్రస్తావించగా బృందంలోని ఎక్కువ మంది ఇంజినీర్ల నుంచి ‘కాదు’ అనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిపై నీటిపారుదల అధికారిని సంప్రదించగా తక్షణం తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రస్తుతం సర్వే చేయించామని, త్వరలోనే సమగ్ర సర్వే చేయిస్తామని తెలిపారు.

మదీనాగూడ పటేల్​చెరువు పీడర్​ ఛానల్​పై నిర్మాణాలతో వర్షపునీరు వచ్చే చోట ఇలా మురుగు నీరు వస్తోంది.

బృందంలోని పలువురు ఇంజినీర్ల అభిప్రాయాలు ఇలా...

  • అసలు సమస్య తూములు, అలుగులు, కట్టలు బాగు చేయడం కాదు. ఆక్రమణలు తొలగించడం, నీటివనరుల బలోపేతం సమాంతరంగా చేయాలి.
  • ప్రతి చెరువును ఒక యూనిట్‌గా తీసుకొని దాని సామర్థ్యం మేరకు నిల్వ ఉండేలా చూడాలి. వీలుకాని చోట ఉన్నదాన్నైనా రక్షించుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. చెరువులు, కుంటల్లోకి నీరొచ్చే మార్గం, బయటకు వెళ్లే మార్గం దాని సామర్థ్యానికి తగ్గట్లుగా ఉండేలా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే డబ్బులు ఖర్చవుతాయి తప్ప, సమస్య మాత్రం యథాతథంగానే ఉంటుంది.
  • అనేక చోట్ల ఈ పరిస్థితికి రాజకీయ నాయకుల ప్రమేయం లేదా వీరి మద్దతు కారణం.
  • కొన్ని భారీ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా ఇంజినీర్లే సహకరిస్తున్నారు.
  • ఈ పరిస్థితులలో మార్పు రాకుండా సమస్యకు పరిష్కారం రాదు.
  • ఒక చెరువు కింద చూస్తే కాలువ మొత్తం ఆక్రమణలే. 20 అడుగుల వెడల్పు ఉండాల్సిన కాలువ ఏడెనిమిది అడుగులు కూడా లేదు. ఇంకో ఏడాది అయితే ఇది కూడా మిగలదు. అక్కడకు వెళ్లి చూడటానికి కూడా అనుమతించడం లేదు.
  • ఒక చెరువును పరిశీలిస్తే చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణలున్నాయి. కట్ట దిగువన కూడా ఉన్నాయి. తూమును పనికిరాకుండా చేశారు. దానిని బాగు చేసినా దిగువన నీటి ప్రవాహానికి అవకాశం లేదు.

ఓ చెరువు కింద లేఔట్‌ వేసి చుట్టూ నిర్మాణం చేపట్టారు. నీరు వదిలితే ఆ లేఔట్‌లోకి పోతాయని తూమును ధ్వంసం చేసి మూసేశారు. ఇప్పుడు బాగు చేసినా మళ్లీ అదే పరిస్థితి వస్తుంది తప్ప పరిష్కారం కాదు.

- నగరంలో చెరువులపై అధ్యయనం చేయడానికి నీటిపారుదల శాఖ నియమించిన కమిటీలోని ఇంజినీర్ల వ్యాఖ్యలివి

ఇదీ చదవండిఃనీటమునిగిన ఇళ్లు.. ఆదుకోవాలని బాధితుల వేడుకోలు

ABOUT THE AUTHOR

...view details