ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ల చెల్లింపులో కోతను మే నెలలో కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమైన సీఎం... ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం నిలిపివేత - cm kcr latest news
20:31 May 27
ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం నిలిపివేత
రాష్ట్రానికి నెలకు 12వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం రావాల్సిన ఉండగా... మే నెలలో పన్నుల్లో రాష్ట్ర వాటాగా కేంద్రం నుంచి వచ్చిన రూ.982 కోట్లతో కలిపి కేవలం రూ.3,100 కోట్లు మాత్రమే వచ్చాయని అధికారులు వివరించారు. లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదని... రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదని చెప్పారు. కొద్ది మొత్తంలోనే ఆదాయం వచ్చిందని తెలిపారు. అప్పులను రీషెడ్యూల్ చేయకపోవడంతో ఏడాదికి రూ.37,400 కోట్ల అప్పులకు కిస్తీలను ప్రతి నెలా కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.
అలా చేస్తే ఖజానా ఖాళీ
ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదని కూడా చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే మూడు వేల కోట్లకు పైగా వ్యయమవుతుందని... ఖజానా ఖాళీ అవుతుందని వివరించారు. ఇతర చెల్లింపులు, పనులు ఏవీ చేసే పరిస్థితి ఉండబోదని... తగిన వ్యూహాన్ని అనుసరించాలని చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వేతనాల్లో కోత కొనసాగించాలని నిర్ణయించారు.
బియ్యం పంపిణీ కొనసాగుతుంది
ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలు జూన్లో కూడా కొనసాగనున్నాయి. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది వేతనాల్లో 10 శాతం కోత కొనసాగుతుంది. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలోనూ అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ప్రతి కుటుంబానికి నెలకు రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం నిలిపివేస్తామని తెలిపింది. ఆసరా ఫించన్లను యాథావిధిగా అందించాలని, అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలని నిర్ణయించారు.