Prof Kodandaram Comments on KCR : రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు నిరసిస్తూ.. భారత రాజ్యాంగం పరిరక్షణ పేరుతో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రాజకీయ, ప్రజాసంఘాలు, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ నిరంకుశత్వానికి రాజ్యాంగం అడ్డు వస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. అందరం కలిసికట్టుగా వ్యతిరేకించకపోతే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం బతకవంటూ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కేసీఆర్ పెత్తనానికి రాజ్యాంగం అడ్డుగా వస్తోంది. ఆయన నిరంకుశత్వానికి ఆటంకంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా చేస్తున్న దాడులకు అడ్డుగా కనిపిస్తోంది. అందుకే ఆయన రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.' - కోదండరాం, తెజస అధ్యక్షుడు
Manda Krishna Comments on CM KCR : రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. దానిపై పోరాడాలి కానీ పూర్తిగా మార్చాలనడం విడ్డూరమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఏడేళ్లలో కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు, రాజ్యాంగ సవరణలను తెరాస ఎందుకు సమర్థించిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తీరు సరిగా లేకుంటే.. పార్లమెంటులో పోరాడాలన్నారు. పాలకులు చేసే ఏ పనికి రాజ్యాంగం అడ్డు వచ్చిందో అర్థం కావడం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారనే భావన ఇందులో ఉందని అనుమానం వ్యక్తం చేశారు.