శాస్త్రసాంకేతిక రంగ విప్లవ ఫలితాలు మన జీవితానికి సుఖ సంతోషాలనిస్తున్నాయి. ఏలూరులోని హోటల్ ఆదిత్య ప్రిన్స్‌లో కొసరికొసరి వడ్డిస్తున్న రోబోలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వినియోగదారునికి కొత్త అనుభూతులు అందించేందుకు హోటల్ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిన రోబో ఫుడ్ సర్వీసింగ్‌కు మంచి స్పందన వస్తోంది. అమ్మ వడ్డిస్తే తినేందుకు మారాం చేసే పిల్లలు... రోబోను మళ్లీ మళ్లీ చూసేందుకు.... ప్లేటులో వడ్డించగానే గుటుక్కుమనిపిస్తున్నారు. రోబోలే స్వయంగా టేబుల్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి మరీ ఆర్డర్లు తీసుకుంటున్నాయి.
నగరంలో అందరికీ ఈ రోబో సర్వీసింగ్ గురించి తెలియటంతో హోటల్‌కు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. మరమనుషులు క్షణం తీరిక లేకుండా వడ్డిస్తున్నాయి. కొవిడ్ దెబ్బకు పూర్తిగా దెబ్బతిన్న హోటల్ రంగానికి... రోబో సర్వీసింగ్ కొత్త జవసత్వాలు తీసుకొచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువగానే ఉన్నప్పటికీ... దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు.