Roads Damage : ఏపీలో రోడ్ల సొగసు నాలుగు వానలకే బట్టబయలైంది. అసలే అధ్వానంగా ఉన్న నగర, పట్టణ రహదారులన్నీ వానలకు మరింత దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గుంతల్లో నీళ్లు నిలిచి చెరువుల్లా మారాయి. అందులో దిగితే ఎంత లోతు ఉంటుదో తెలియదు.. దిగకపోతే ప్రయాణం సాగదు.. ఈ గందరగోళం మధ్య వాహనచోదకులు ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. నడవడానికి కూడా దారి వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్న రహదారులపై ప్రయాణం ఎలాగని బెంబేలెత్తిపోతున్నారు. అద్దం లాంటి రోడ్ల మాట దేవుడెరుగు.. ఈ గుంతలైనా పూడ్చండి మహాప్రభో అని పట్టణ ప్రజలు మొత్తుకుంటున్నా పురపాలక అధికారుల చెవికెక్కడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లోనూ ప్రయాణానికి అవస్థలు పడుతున్నా.. అక్కడా మరమ్మతుల్లేవు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడలతోపాటు ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాల్లో కాలనీలు, వీధుల్లోని రోడ్లపై అడుగేయడం దుర్భరంగా తయారవుతోంది. రాష్ట్రంలోని 15 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ‘ఈనాడు’ ప్రతినిధుల బృందం బుధవారం పలు రహదారులను పరిశీలించింది. వాటిలో అత్యంత దయనీయంగా ఉన్న కొన్నింటి పరిస్థితి ఇదీ.
గుంటూరు జిల్లా:గుంటూరు నగరం మల్లారెడ్డినగర్‌లోని ఇస్కాన్ దేవాలయం మార్గంలో.. రహదారి కంటే గోతులే ఎక్కువ. అప్పుడప్పుడు కంకర పోసి వదిలేస్తున్నారు. వానాకాలం రాగానే మళ్లీ గుంతలే దర్శనమిస్తున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ భవానీపురంలో రహదారిపై గుంతల్లో పెద్ద ఎత్తున నిలిచిన వర్షపునీరు
భీమవరం దారుల సొగసిదీ..:పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం నుంచి గ్రామీణ మండలంలోని పలు గ్రామాలు, పట్టణంలోని విద్యా సంస్థలు, ఆసుపత్రులకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. రూ.21 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల కిందట శంకుస్థాపన చేసినా నేటికీ పనులు పూర్తికాలేదు. దీంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. భీమవరం కలెక్టరేట్‌కు వెళ్లే దారిలోనూ ఇదే పరిస్థితి.
కోనసీమ జిల్లా:మండపేట నుంచి ఏడిద వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారికి మరమ్మతుల్లేవు. మూడు కి.మీ పొడవున్న ఈ రోడ్డంతా గుంతలమయమే. భారీ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారి మరమ్మతులను ఎవరూ పట్టించుకోవడం లేదు. అమలాపురం మున్సిపాలిటీలోని నల్లవంతెన - ఎర్రవంతెన మధ్య 1.20 కి.మీ పొడవున్న రహదారిలోనూ 12 పెద్ద గుంతలు, 20 చిన్నగుంతలు పడ్డాయి.