హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే నెక్లెస్ రోడ్‌ను 26 కోట్ల రూపాయల వ్యయంతో నవీకరించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న బ్లాక్ టాప్ రోడ్డును వాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్ రోడ్డుగా మార్చే పనులకు బోర్డు శ్రీకారం చుట్టింది. ఆరు కిలోమీటర్ల పొడవున వీడీసీసీ రోడ్డు పనులు హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పర్యవేక్షణలో అధికారులు నిర్వహిస్తున్నారు.
తారు రోడ్డు కాస్త వీడీసీసీ...
లాక్‌డౌన్ సమయంలో ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారుల అనుమతులతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. నెక్లెస్ రోడ్డు ప్రారంభం (ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం) నుంచి సికింద్రాబాద్ బుద్ధభవన్ సెయిలింగ్ క్లబ్ వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర (తారు రోడ్డు) కాస్త సిమెంట్ కాంక్రీట్ రోడ్డు(సీసీ రోడ్డు)గా రూపొందనుంది. హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు నెక్లెస్ రోడ్డులో వీడీసీసీ రోడ్డు పనులు మూడు నెలల కాలంలో పూర్తి చేయాలని సంకల్పించారు. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో లాక్‌డౌన్ పీరియడ్ ముగిసిన తర్వాత నెక్లెస్ రోడ్ వెంట ఒక వైపు ట్రాఫిక్‌ను అనుమతిస్తూ మరోవైపు పనులు నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి : దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం