మద్యం సేవించి బండెక్కుతున్నారు. మందు మత్తులో హై స్పీడ్‌లో దూసుకెళ్తూ.. తమ ప్రాణాలకే గాక.. ఎదుటి వారి ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు. ఈ 11 నెలల్లో మద్యం తాగి వాహనాలను నడపటం వల్ల 15 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొత్తం 455 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 153 మంది దుర్మరణం చెందారు. మరో 408 మంది తీవ్ర గాయాలపాలైనట్లు లెక్క తేల్చారు.
మత్తులో డ్రైవింగ్.. ప్రాణాలపై లేదు కేరింగ్.. - road accidents due to alcohol consumption
చుక్కేసి రోడ్డెక్కుతున్నారు.. కిక్కులో రయ్.. రయ్‌మంటూ గాల్లో దూసుకెళ్తున్నారు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తోటి వాహనదారులనూ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. తాజాగా దుండిగల్ ఠాణా పరిధిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. గచ్చిబౌలి విప్రో చౌరస్తా దగ్గర ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణంపాలయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు ఈ 11 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై లెక్కలు తీశారు. సైబరాబాద్ పరిధిలో అన్నిరకాల రోడ్డు ప్రమాదాలు 2,951 చోటు చేసుకోగా 663 మంది మరణించారు. 3,013 మంది క్షతగాత్రులయ్యారు. మిగిలిన నెలలతో పోలిస్తే నవంబర్‌లోనే అత్యధికంగా ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు.
పదేళ్ల వరకు జైలు శిక్ష..
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుపడితే కఠినంగా వ్యవహరిస్తున్నారు. కౌన్సెలింగ్‌తో సరిపెట్టకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సైబరాబాద్ పోలీసులు సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటికే 5 వేలకుపైగా లేఖలను ఆర్టీఏ అధికారులకు రాశారు. తీవ్ర ప్రమాదాలకు కారణమైతే ఐపీసీ 304 పార్ట్-2 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఈ సెక్షన్ కింద ఇప్పటివరకు 35 మందిపై కేసులు పెట్టారు. వీరికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని పోలీసులు వివరిస్తున్నారు. మరికొందర్ని కూడా అరెస్ట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తాజా ఘటనల నేపథ్యంలో సైబరాబాద్ సీసీ వీసీ సజ్జనార్ అప్రమత్తమయ్యారు. డ్రంకెన్ డ్రైవింగ్‌పై మరింత కఠినంగా వ్యవహరించేలా సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
- ఇదీ చూడండి :కరోనా వేళ దేశంలో పెరిగిన గృహహింస