వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ తహశీల్దార్ కార్యాలయాల్లోనే నిర్వహించాలని రెండేళ్ల కిందటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సిబ్బందికి రిజిస్ట్రేషన్ల నిర్వహణ, రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన అవసరమని ప్రభుత్వం భావించింది. 2018లో రాష్ట్రంలోని 443 మంది తహశీల్దార్లకు పది రోజులు శిక్షణ కూడా ఇచ్చారు. భారత స్టాంపుల చట్టం-1899, రిజిస్ట్రేషన్ల చట్టం -1908లపై మూడు రోజులపాటు హైదరాబాద్ ఎంసీహెచ్ ఆర్డీలో అవగాహన కల్పించారు. ఆ తరువాత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. అప్పట్లో రాష్ట్రంలో 594 తహశీల్దార్ కార్యాలయాలు ఉండగా పట్టణ ప్రాంత రెవెన్యూ కార్యాలయ అధికారులను ఈ శిక్షణలో మినహాయించింది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 21 మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
తెలంగాణలో రెవెన్యూ చట్టం తీసుకురావడం, తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పట్టణ తహశీల్దార్ కార్యాలయాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరుగుతున్న 21 ఎమ్మార్వో కార్యాలయాలను మినహాయించి, ఎన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న అంశంపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూ శాఖ రెండింటినీ అనుసంధానం చేయాల్సి ఉండగా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ భూములతో సంబంధం లేని మండల రెవెన్యూ కార్యాలయాలను మినహాయించి మిగిలిన అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు.