వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు పాదయాత్ర చేయడం, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను మళ్లీ కలిపేద్దామని ఏపీ మంత్రి పేర్నినాని ప్రతిపాదనలు చేయడం అనుకోకుండా జరిగినవి కావని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను మరింతగా పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి జైలుకు వెళతారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని రేవంత్రెడ్డి అన్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకుంటున్నట్లుగా ప్రస్తుత పరిణామాలున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు మొదటి నుంచి కూడా కవలపిల్లల్లా కలిసిపోతున్నారని, ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రం కోసం ఆలోచన చేస్తున్నట్లు ఉందని విమర్శించారు.
'కేసీఆర్, జగన్ మొదట్నుంచి కవలలుగా కలిసి వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర, పేర్ని నాని వ్యాఖ్యలు యాధృచ్ఛికం కావు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర సాగుతోంది. జగన్ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నట్లుంది.'
- రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు.