తెలంగాణ

telangana

ETV Bharat / city

TPCC: రేవంత్​ హస్తానికి పగ్గాలు... పార్టీలో కొత్త ఆశలు - తెలంగాణ కాంగ్రెస్​కు కొత్తసారథిగా రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి... కాంగ్రెస్‌ అధిష్ఠానం పీసీసీ పగ్గాలను అప్పగించింది. ఆరుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, 10 మంది ఉపాధ్యక్షులు సహా.. ప్రచార, ఎన్నికలు, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీలను ప్రకటించింది. కాంగ్రెస్‌లో 80 శాతానికిపైగా నాయకులు రేవంత్‌ సారథ్యాన్నే కోరుకోవటంతో... సీనియర్ల అభ్యంతరాలను పక్కనపెట్టి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా... 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

REVANTH REDDY HAS BEEN APPOINTED AS THE PRESIDENT OF TELANGANA PCC
REVANTH REDDY HAS BEEN APPOINTED AS THE PRESIDENT OF TELANGANA PCC

By

Published : Jun 27, 2021, 4:28 AM IST

Updated : Jun 27, 2021, 6:41 AM IST

దశాబ్దాల పాటు పాలించిన పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం ఎలా...? వరుస వైఫల్యాల నుంచి విజయతీరాలకు చేరేదెలా...? అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే సారథి ఎవరు...? నేతల ఏకాభిప్రాయంతో అధ్యక్షుడి ఎంపిక సాధ్యమేనా...? ఇలా ఎన్నో ప్రశ్నలు.... సందేహాలతో... సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్‌ శ్రేణుల ఎదురుచూపునకు అధిష్ఠానం తెరదించింది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో... ఆయన్నే పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం కొనసాగించింది. తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు సేకరించారు.

సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుని ప్రకటన వద్దని సీనియర్‌ నేత జానారెడ్డి కోరడంతో నాడు నిలిచిపోయింది. ఉప ఎన్నిక తర్వాత నుంచి పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి నుంచి రేసులో రేవంత్‌రెడ్డి పేరే ముందున్నా పలువురు సీనియర్‌ నేతలు తరచూ దిల్లీకి వచ్చి రకరకాల ఫిర్యాదులు చేయడం, సామాజిక వర్గాల నేపథ్యంతో పలు కొత్త పేర్లు తెరపైకి రావడం.. ప్రకటన ఆలస్యమవడంతో ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. చివరకు ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేసులో నిలవడంతో వారం క్రితం ఇద్దరు నేతలతో కాంగ్రెస్‌ అధిష్ఠానం వేర్వేరుగా చర్చలు జరిపింది. గత పదిహేను రోజులుగా రేవంత్‌రెడ్డి దిల్లీలోనే ఉండగా..కోమటిరెడ్డి పలుమార్లు హస్తినకు వచ్చి వెళ్లారు. చివరకు చురుకైన నేతగా పేరున్న రేవంత్‌రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది.

అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా...

పార్టీ నేతల సమన్వయంతో ముందుకెళ్తూ... కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తానని పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. అధిష్ఠానం ప్రకటన అనంతరం, పార్టీ సీనియర్లు జానారెడ్డి, షబ్బీర్ అలీ ఇళ్లకు వెళ్లి వారితో సమాలోచనలు జరిపారు. పార్టీ సీనియర్లందరినీ కలిసి... వారి అభిప్రాయాల మేరకు ముందుకు సాగనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 2023 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ నూతన కార్యవర్గంలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ కమిటీ బాధ్యతల్లో అగ్రవర్ణాలతో పాటు ఇతర సామాజిక వర్గాలకూ చోటు కల్పించారు. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డిని ఎంపికచేసిన నేపథ్యంలో అయిదుగురిని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించింది. వీరిలో ఎస్సీ, బీసీ,మైనార్టీ వర్గాలకు చెందినవారున్నారు. పదిమందిని సీనియర్‌ ఉపాధ్యక్షులుగా నియమించగా ఇందులో సీనియర్‌ నేతలకు సముచిత స్థానం కల్పించారు.

ప్రచార కమిటీ

  • మధుయాస్కీ గౌడ్‌- ఛైర్మన్‌
  • సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేని- కన్వీనర్‌
  • ఎన్నికల నిర్వహణ కమిటీ

ఛైర్మన్‌ దామోదర్‌ సి.రాజనరసింహ

  • ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ

ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కార్యనిర్వాహక అధ్యక్షులు

  • మహ్మద్‌ అజహరుద్దీన్‌, మాజీ ఎంపీ
  • డాక్టర్‌ జె.గీతారెడ్డి, మాజీ మంత్రి
  • ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీ
  • టి.జగ్గారెడ్డి, ఎమ్మెల్యే, సంగారెడ్డి
  • బి.మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

సీనియర్‌ ఉపాధ్యక్షులు

  • సంభాని చంద్రశేఖర్‌, మాజీ మంత్రి
  • దామోదర్‌రెడ్డి, మాజీ మంత్రి
  • డాక్టర్‌ మల్లురవి, మాజీ ఎంపీ
  • పొదెెం వీరయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం
  • సురేష్‌ షెట్కార్‌, మాజీ ఎంపీ
  • వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
  • రమేష్‌ ముదిరాజ్‌
  • గోపిశెట్టి నిరంజన్‌
  • టి.కుమార్‌ రావు
  • జావేద్‌ అమీర్‌

జానాను కలిసిన రేవంత్‌

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిని కలిశారు. ఆ తరువాత శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ నివాసానికి వెళ్లారు. రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు.

సామాజిక సమీకరణలకే ప్రాధాన్యం

రాష్ట్రంలో 2023 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించిన కాంగ్రెస్‌ కార్యవర్గంలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ కమిటీ బాధ్యతల్లో అగ్రవర్ణాలతో పాటు ఇతర సామాజిక వర్గాలకూ చోటు కల్పించారు. ప్రచార కమిటీ బాధ్యతలను మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీకి అప్పగించారు. ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు ఇవ్వగా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు బాధ్యతను మాజీ ఎమ్మెల్యే ఏ.మహేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డిని ఎంపికచేసిన నేపథ్యంలో అయిదుగురిని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించింది. వీరిలో ఎస్సీ, బీసీ,మైనార్టీ వర్గాలకు చెందినవారున్నారు. పదిమందిని సీనియర్‌ ఉపాధ్యక్షులుగా నియమించగా ఇందులో సీనియర్‌ నేతలకు సముచిత స్థానం కల్పించారు.

ఏఐసీసీ నిర్ణయం సముచితం : మల్లు రవి

రేవంత్‌రెడ్డి ఎంపిక సముచితమైనదిని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఎదిరించి పోరాటం చేయాలంటే కాంగ్రెస్‌ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

ఇదీ చూడండి: వైరలవుతోన్న 'ఈటల లెటర్'​పై బాల్క సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Last Updated : Jun 27, 2021, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details