Revanth reddy on Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలో భాజపా, తెరాసలకు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఇప్పటకే టికెట్ ఆశించిన ఆశావహులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుజ్జగించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు సహా ఇతర సీనియర్ నేతలు మునుగోడు ఉపఎన్నిక, పలు అంశాలపై చర్చించారు.
కేసీఆర్‌ను సంతోష పెట్టేందుకు ఆ పార్టీ నాయకులు.. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల వ్యవస్థలు కుప్పకూలాయని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచార వ్యూహంలో భాగంగా పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభిస్తామని... నల్లగొండ జిల్లా కు కేంద్ర ప్రభుత్వం వల్ల ఎటువంటి లాభం జరగలేదని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు తెరాస, భాజపా కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.