కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై.. ఇటీవల.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పార్లమెంటరీ ఐటీ స్థాయీసంఘం ఛైర్మన్ హోదాలో ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చిన థరూర్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దానిపై రేవంత్.. థరూర్‌ను విమర్శించారు. ఈ క్రమంలో థరూర్‌కు రేవంత్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. దానికి శశిథరూర్ స్పందిస్తూ.. ఈ వివాదానికి ముగింపు పలుకుదామన్నారు. 'మనం అంతా కలిసి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం' అని రీట్వీట్ చేశారు.
రేవంత్ వ్యాఖ్యలు దారుణం..
సహచర ఎంపీ అయిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth reddy).. శశిథరూర్‌పై అవమానకరంగా చిల్లర వ్యాఖ్యలు చేయడం దారుణమని మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్లో పేర్కొన్నారు. నేర చరిత్ర, స్వభావం ఉన్న వారు పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు. థరూర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ట్విటర్లో ఉంచారు. దీన్ని ఫోరెన్సిక్ విభానికి పంపిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ గొంతుతో కచ్చితంగా సరిపోతుందని అన్నారు.
అది కచ్చితంగా జబ్బే..
థరూర్‌పై చేసిన వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డి(Revanth reddy).. అబద్ధాలు, సంఘ వ్యతిరేక వ్యక్తిత్వం, క్రమశిక్షణ రాహిత్యమనే జబ్బుతో బాధ పడుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. వెంటనే ఆయన చికిత్స కోసం మానసికి వైద్యుడి వద్దకు వెళ్లాలని సూచించారు. వైద్య ఖర్చులను తామే భరిస్తామని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.