కరోనా మహమ్మారి కట్టడికి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాకపోకలు, వాణిజ్య లావాదేవీలు అన్నింటిపైనా నిషేధాజ్ఞలు విధించింది. ప్రభుత్వం ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. విజయవాడలో రాత్రి ఎవరినీ రోడ్లపైకి అనుమతించలేదు. నగరంలో 80 పికెట్స్, 62 బీట్లు ఏర్పాటుచేశారు. పరిస్థితిని బట్టి మరింత పెంచుతామన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాత్రి వేళ కాలినడకన తిరుగుతూ సీఐ చైతన్య కృష్ణ కర్ఫ్యూని పర్యవేక్షించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. విశాఖలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు కర్ఫ్యూతో నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పోలీసులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. తమ ఉద్యోగులకు నాలుగు షిప్టులు ఉన్నాయని వారు విధులకు వచ్చి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది.