Mahanadu: మూడేళ్ల విరామం తర్వాత భారీ ఎత్తున మహానాడు జరుగుతుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. మండే ఎండలనూ లెక్కచేయకుండా, సుదూర ప్రాంతాల నుంచి ఉత్సాహంగా కదలివచ్చారు. చిన్న, పెద్ద, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువజనం సందడికి కొదవేలేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారుల ఆనందానికి అంతే లేదు. ఎక్కడెక్కడి నుంచో రైళ్లు, బస్సుల్లోను, ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేసుకుని మరీ వచ్చారు. నాయకుల ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా వారంతట వారే తరలివచ్చారు. భారీ జనసందోహాన్ని ఉద్దేశించి అధినేత చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
మూడేళ్లలో ఏపీ సర్వనాశనమైందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు దిశానిర్దేశం చేసుకోవాల్సి ఉందన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి... మోసపూరిత సంక్షేమం, అవినీతితో జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారని.. అలాంటి వైకాపా ప్రభుత్వాన్ని, పాలకుల్ని నడిరోడ్డుపై నిలదీయాల్సిన బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు. ఈ మూడేళ్లలో జగన్, ఆయన అనుచరుల ఆదాయాలు పెరగ్గా, ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయని, వారి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆస్తుల విలువలు పడిపోయాయని పేర్కొన్నారు. అధిక ధరలు, పన్నులతో ప్రజల్ని బాదేసి... రాష్ట్రాన్ని జగన్ దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఈ ‘బాదుడే.. బాదుడు’ను ప్రతి చెవిలో వేయాల్సిన బాధ్యత తెదేపా కార్యకర్తలదేనని సూచించారు. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో శుక్రవారం ఉదయం తెదేపా మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. 25 మంది ఎంపీల్ని, అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తానంటూ ఎన్నికలకు ముందు చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు కేంద్రం ముందు మెడలు దించారని విమర్శించారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధులు సహా ఏమీ సాధించలేకపోయారని ధ్వజమెత్తారు.
మహానాడులో చంద్రబాబు ప్రసంగం ఆయన మాటల్లోనే..
డయాఫ్రమ్ వాల్ అంటే జగన్‌కు తెలుసా?: 'రివర్స్ టెండర్ల పేరిట పోలవరం ప్రాజెక్టును జగన్ నాశనం చేశారు. దానివల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో అదే అత్యంత కీలకం. అదే లేకపోతే నీళ్లే నిల్వ ఉంచలేని పరిస్థితి. అసలు జగన్‌కు డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో, కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలుసా? ఆయన అనాలోచిత, కక్షపూరిత చర్యలవల్ల ఇప్పుడు రైతులు, రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. ఏం పాపం చేసిందని రూ.2లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల సంపద సృష్టించే అమరావతిని నాశనం చేశారో జగన్ సమాధానం చెప్పాలి. మా హయాంలో మేము 25వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. మూడేళ్లలో వైకాపా ప్రభుత్వం కొత్తగా ఒక్క కిలోమీటరు రోడ్డైనా నిర్మించిందా? మళ్లీ వర్షాకాలం వస్తోంది. ఏపీలోని రోడ్లపై చేపలు పట్టుకోవచ్చనేంతగా గుంతలున్నాయి. 30లక్షల ఇళ్లు కడతామని చెప్పిన జగన్ .. మూడేళ్లలో కనీసం మూడిళ్లు అయినా నిర్మించలేకపోయారు.
అంబేడ్కర్ ప్రాజెక్టును ఎందుకు నిలిపేశారు?: కోనసీమలో చిచ్చుకు వైకాపాయే కారణం. ఆ పార్టీకి అంబేడ్కర్‌పై అభిమానముంటే తెదేపా హయాంలో తలపెట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రాజెక్టును ఎందుకు నిలిపేశారు? ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే అంబేడ్కర్‌కు భారతరత్న పురస్కారం లభించింది.
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై పోరాడాలి: వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటానికి రైతులంతా సిద్ధం కావాలి. వారికి తెదేపా మద్దతుగా ఉంటుంది. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్తు మీటర్లు తీసేసింది ఎన్టీఆరే. అవి ఏర్పాటు చేస్తే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. బలిదానాలతో మీ కుటుంబాల్ని అనాథల్ని చేయొద్దని అన్నదాతలకు విజ్ఞప్తి చేస్తున్నా. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాడండి. రాష్ట్రంలో రైతుల నుంచి కొన్న ధాన్యానికి డబ్బులిచ్చే పరిస్థితే లేదు. వ్యవసాయానికి ఈ ప్రభుత్వం నుంచి సహకారమే లేదు.