Heavy Inflow to Reservoirs: ఎగువ నుంచి పోటెత్తున్న ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండా మారగా... గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి నాగార్జునసాగర్ వరకు కిందకు పరుగులు పెడుతోంది. దీంతో జూరాల జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.29 లక్షల క్యూసెక్కులుకాగా.. తాజాగా అవుట్‌ఫ్లో 1.27లక్షల క్యూసెక్కులుగా కొనసాగిస్తున్నారు. జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 318.070 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.657టీఎంసీలు.. ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 8.750 టీఎంసీలుగా కొనసాగిస్తున్నారు.
నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరద.. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటితో సాగర్ ప్రాజెక్టు పూర్తి నిండుకుండలా మారింది. ఎంతకీ వరద ప్రవాహం తగ్గక పోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు పంపిస్తున్నారు. జలాశయం ఎగువ నుంచి 2 లక్షల 14వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో సాగర్ 20క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్‌వే ద్వారా 1లక్ష 16 వేల120 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నా రు.
సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులు చేరింది. 312 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయం పూర్తిగా నిండిపోయింది. జులై చివరి వారం నుంచి నాగార్జున సాగర్ జలాశయం కు ప్రారంభం అయిన వరద ప్రవాహం తో ఈ నెల 11 నుంచి 26 గేట్లను ఎత్తి 13 రోజుల గా నీటి విడుదల చేపట్టారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహo కాస్త తగ్గుముఖం పట్టడంతో గేట్లను అధికారులు అధికారులు మూసివేశారు.