'పొద్దున వరకు వచ్చేస్తామని చెప్పారు..' బస్సు ప్రమాదంపై బంధువుల భావోద్వేగం Road Accident Karnataka:గోవాలో ఘనంగా పుట్టిన రోజు జరుపుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంతో.. బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులంతా విషాదంలో మునిగిపోయారు. ఏటా వెళ్లినట్టుగా ఈసారి కూడా విహారయాత్రకు వెళ్లారని.. కానీ అది ఓ పీడ కలలను మిగిల్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతీ ఏడాది.. రకరకాల ప్రదేశాలకు వెళ్లేవాళ్లమని.. ఈసారి అర్జున్ తన కుమార్తె పుట్టినరోజును గోవాలో జరిపేందుకు ప్లాన్ చేశాడని తెలిపారు. ముందుగా.. సొంత వాహనాల్లో వెళ్దామనుకుని కుదరక మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు.
నెల రోజుల ముందుగానే టూర్ ప్లాన్ వేసినట్టు బంధువులు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము టూర్ వెళ్లలేకపోయామని.. చివరికి ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కూడా తన వాళ్లు మాట్లాడారని.. పొద్దున వరకు ఇంటికి వచ్చేస్తామని ఆనందంగా చెప్పారని ఉద్వేగానికి లోనయ్యారు.
"ఈ ప్రమాదం గురించి వార్తలు చూసి ఇంట్లో వాళ్లు నాకు ఫోన్ చేశారు. అర్జున్ పేరు వినిపిస్తోందని చెప్తే.. వాళ్లకు కాల్ చేశా. కానీ ఎటువంటి స్పందన లేదు. కాసేపటికి.. స్పష్టత వచ్చేసింది. మా వాళ్ల బస్సే ప్రమాదానికి గురైందని. అర్జున్ లక్మీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతీ సంవత్సరం.. ఇలా విహారయాత్రలకు వెళ్తుంటాం. కొన్ని కారణాల వల్ల మేం ఈసారి వెళ్లలేకపోయాం. తీరా చూస్తే ఇలా జరిగింది. నెల రోజుల నుంచే టూర్ ప్లాన్ చేశారు. ఒక వారం ముందు ఆరెంజ్ ట్రావెల్స్ బస్ బుక్ చేసుకున్నారు. రోజూ ఫోన్స్ మాట్లాడుకుంటూనే ఉన్నాం. నిన్న రాత్రి కూడా ఫోన్ మాట్లాడారు. పొద్దున వరకు వచ్చేస్తామని చెప్పారు." - అర్జున్ బంధువులు
డ్రైవర్ సహా 35 మందితో కూడిన ప్రైవేటు బస్సు గురువారం రాత్రి గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఒక కుటుంబానికి చెందిన 11 మంది.. మరో కుటుంబానికి చెందిన 21 మందితో పాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. తెల్లవారుజామున కర్ణాటకలోకి ప్రవేశించిన ట్రావెల్స్ బస్సు బీదర్- శ్రీరంగపట్టణం హైవే గుండా గమ్యం వైపు సాగుతున్న క్రమంలో.. కమలాపుర వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మినీ లారీని బస్సు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: