Attack :తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రేమించలేదన్న కారణంతో ఉన్మాదులుగా మారుతున్నారు. తాజాగా ఏపీలోని విజయవాడలో ఓ బాలికపై ప్రేమోన్మాది దాడి చేశాడు. కత్తి దాడిలో స్వల్ప గాయాలైన బాలిక... ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Attack: బెజవాడలో దారుణం.. బాలికపై ప్రేమోన్మాది దాడి
21:02 January 09
Attack: బెజవాడలో దారుణం.. బాలిక గొంతు కోసిన యువకుడు
ప్రేమోన్మాదుల ఘాతుకాలు ఆగడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ప్రేమ పేరిట విజయవాడలో ఆదివారం మధ్యాహ్నం ఓ బాలికపై జరిగిన దాడి... కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిరాతకుడి దాడిలో గాయపడిన విజయవాడ భారతి నగర్‌కు చెందిన బాలిక... ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
భారతి నగర్‌లో నివసించే బాలిక... ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెకు తల్లి లేదు. తండ్రి అనారోగ్యం బారిన పడటంతో.. నాయనమ్మే ఆమెను సంరక్షిస్తోంది. విజయవాడలో ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన హరీష్... బాధిత బాలికతో కలిసి మూడేళ్ల పాటు ఒకే పాఠశాలలో చదివాడు. అప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో హరీష్ ఆమెను తరచూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుక చేసుకున్న బాలికపై.... తనను ప్రేమించమంటూ ఒత్తిడి చేశాడు. ఈ చర్యతో ఆగ్రహించిన బాలిక... హరీష్‌ను చెంపపై కొట్టింది. ప్రేమను తిరస్కరించడమే కాకుండా కొట్టిందనే కోపంతో ఉన్న నిందితుడు... ఆదివారం మధ్యాహ్నం బాధితురాలి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. చాలాసేపు ఆమెతో గొడవ పడ్డాడు. క్రమంగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన హరీష్... అక్కడే ఉన్న కత్తితో ఆమె ముఖం, మెడపై దాడి చేశాడు. కత్తి దాడిలో గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాలికపై దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు... ఆసుపత్రికి వెళ్లి విచారణ చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులు తొలుత తటపటాయించినా.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సెక్షన్ 307 కింద పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు హరీష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.