ముక్కుసూటితనానికి, పోరాట పటిమకు నిలువెత్తు నిదర్శనం నాయిని నర్సింహారెడ్డి. శ్రమజీవుల కోసం నిరంతరం తపించిన కార్మిక పక్షపాతి. కార్మికనేతగా నాయిని సుపరిచితుడు. అందరూ ఆయన్ని "కార్మికనేత నర్సన్న" అని అభిమానంతో పిలిచేవారు. ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘాల నేతగా బడుగుజీవుల కోసం పనిచేశారు.
నేరుడుగొమ్ములో జననం..
నాయిని నర్సింహారెడ్డి 1944 మే 12న.... నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ములో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సుభద్రమ్మ, దేవయ్యరెడ్డి. 1970లో నాయిని హైదరాబాద్‌కు వచ్చారు. వీఎస్టీ కార్మికసంఘం నేతగా పలుమార్లు ఎన్నికయ్యారు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ తొల, మలిదశ ఉద్యమాల్లో నాయిని నర్సింహారెడ్డి కీలక పాత్ర పోషించారు. తెరాస అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన మలిదశ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.