రైతుబంధు పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. పదిరోజుల్లోగా రైతుబంధు సాయం నిధులు రైతుల ఖాతాల్లో జమచేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు... వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. బడ్జెట్ రూపకల్పన సమయంలో 2020 జనవరి 23న సీసీఎల్ఏ సంచాలకులు ఇచ్చిన వివరాల్లోని పట్టాదార్లకు రైతుబంధు వర్తిస్తుందని వ్యవసాయశాఖ తెలిపింది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదార్లు, పెద్దపల్లి జిల్లా కాసులపల్లిలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న 621మంది పట్టాదార్లకు కూడా రైతుబంధు సాయం అందుతుందని స్పష్టం చేసింది.
మధ్యలో చేర్పులుండవ్...
ఆర్థిక సంవత్సరంలో ఒకమారు సీసీఎల్ఏ సంచాలకుల నుంచి వివరాలు తీసుకొని వాటి ఆధారంగా రైతుబంధు సాయాన్ని అందించనున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది. ప్రతి సీజన్‌కు ముందు భూముల లావాదేవీలు పరిశీలించి అమ్మిన భూములు జాబితా నుంచి తొలగించనున్నారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో పట్టాదార్ల తొలగింపులు ఉంటాయి గానీ... చేర్పులు ఉండబోవని స్పష్టం చేసింది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఏడాదిలోనే రైతుబంధు సాయం అందుతుందని తెలిపింది.