చేనేత కార్మికుల పొదుపు పథకం 'నేతన్నకు చేయూత(Netannaku Cheyutha scheme)'లో వచ్చే నెల మొదటి తేదీ నుంచి నమోదు ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. తమ ఆదాయంలో 50 శాతం నేత పని ద్వారా పొందే 18 ఏళ్లు దాటిన వారు అర్హులని పేర్కొంది. రూ.368 కోట్లతో పునఃప్రారంభించిన ఈ పథకంపై గురువారం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. చేనేత కార్మికుల పొదుపు నిధి, భద్రత పథకంగా దీనిని అమలు చేయాలని సూచించింది.
రాష్ట్రంలో చేనేత సంఘాల్లో, సహకారేతర రంగంలోని జియో ట్యాగింగ్ మగ్గాలపై పనిచేసే నేత కార్మికులు, వృత్తికి అనుబంధంగా డైయింగ్, టైయింగ్ డిజైన్, వైండింగ్, వార్పింగ్, సైజింగ్ పనులు చేసే వారికి దీనిని అమలు చేయనున్నారు. ‘సంబంధిత చేనేత సహాయ సంచాలకుల కార్యాలయాల్లో దరఖాస్తులు పొంది, తమ వివరాలను భర్తీ చేసి సమర్పించాలి. అర్హులైన వారిని ఏడీలు గుర్తిస్తారు.