తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక ఏడాదిలో రూ.12,500 కోట్లు రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం(telangana state govt) అంచనా వేసింది. ఆ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించింది. కొవిడ్ కారణంగా కొన్ని రోజులు, ధరణి పోర్టల్ మూలంగా మరికొన్ని రోజులు రిజిస్ట్రేషన్లు(registrations) పూర్తిగా ఆగిపోయాయి. ఆ తరువాత మే 30వ తేదీ నుంచి తిరిగి రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నెలలో రూ.628 కోట్లు, మే నెలలో రూ. 230 కోట్లు, జూన్ మాసంలో రూ.704 కోట్లు, జులై మాసంలో రూ.1,211 కోట్లు, ఆగస్టులో రూ.928 కోట్లు లెక్కన ఆగస్టు చివర నాటికి అయిదు నెలల్లో రూ.3,701 కోట్లు ఆదాయం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు వనకూడింది. అంటే సగటున నెలకు రూ.740 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. ఇదేవిధంగా మిగిలిన ఏడు నెలల్లో ఆదాయం వచ్చినట్లయితే ఈ ఆర్థిక ఏడాదిలో తొమ్మిదివేల కోట్లు కూడా వచ్చే అవకాశం కనిపించడంలేదు.
అంచనాలు తలకిందులు..
రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాలు తరువాత వ్యవసాయ, వ్యవసాయేతర భూములు(non-agricultural lands), ఆస్తుల మార్కెట్ విలువలను పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతం నుంచి 7.5శాతానికి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం జులై 22వ తేదీ నుంచి అమలు చేస్తోంది. ఇందువల్ల దాదాపు రూ. 4,000 కోట్లు అదనపు ఆదాయం.. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రభుత్వం ముందుగా నిర్దేశించిన లక్ష్యం రూ.12,500 కోట్లు రాబడి సునాయాసంగా వస్తుందని ఉన్నతాధికారులు భావించారు. ఆగస్టు నుంచి ఆదాయం పెరుగుతుందని అధికారులు వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. జులై నెలలో వచ్చిన మేరకు కూడా ఆగస్టులో రాలేదు. ఏకంగా రూ.మూడు వందల కోట్లు మేర రాబడి తగ్గింది.
అందుకే ఆదాయం పడిపోయింది..
మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడంతో.. కొనుగోలుదారులపై రెండు రకాల భారం పడుతోంది. ఉదాహరణకు.. రూ.50లక్షలు విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇంటిపై మార్కెట్ విలువలు పెరగడంతో.. ప్రస్తుతం కనీసం పది లక్షలు అదనంగా పెరిగింది. మార్కెట్ విలువలు పెంచకముందు 6శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలతో రూ.50లక్షలకు రూ.మూడు లక్షలు రూపాయిలు వెచ్చిస్తే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది. అంటే మొత్తం రూ.53లక్షలతో ఇళ్లు వచ్చేది. కానీ పెరిగిన మార్కెట్ విలువలతో యాభై లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు.. ఆరవై లక్షలు కావడం, ఆరు శాతం బదులు 7.5శాతంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడంతో ప్రస్తుతం ఇంటికి రూ.64.5లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అంటే ఏకంగా 11.5లక్షలు అదనంగా కొనుగోలుదారుడు భరించాల్సి వస్తోంది. ఉన్న ఫలంగా అదనపు భారం పడడంతో... కొనుగోలుదారులు ముందుకు రాలేకపోతున్నందునే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా తగ్గిందని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందువల్లనే ఆగస్టులో ఆదాయం పడిపోయింది.
నెలకు రూ.1200 కోట్లు వస్తేనే..
సెప్టెంబరులో అయినా ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు అవుతాయని... రాబడి పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కాని ఆ పరిస్థితులు క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. సెప్టెంబరు నెలలో ఇప్పటి వరకు 35వేలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యి కేవలం రూ.305 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. అంటే రోజుకు 30 కోట్లుకు మించి ఆదాయం రావడం లేదు. ఈ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఏడు నెలలుపాటు ప్రతి నెలా.. నెలకు రూ.1200 కోట్లుకు తగ్గకుండా ఆదాయం వస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు రాబడి వస్తుందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి:Engineering colleges: రాష్ట్రంలో 85,149 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి