రాష్ట్రంలో ఇటీవల పెరిగిన భూముల విలువ, కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీల అమలుతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకేసారి 20 నుంచి 50 శాతం ఛార్జీలు పెరగడంతో క్రయవిక్రయదారులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వారు కూడా అదనపు ఛార్జీలు చెల్లించాలనడం వల్ల కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ రుసుములతో స్లాట్లు బుక్ చేసుకున్నవారు... తీరా కార్యాలయానికి వచ్చాక కొత్తగా అమలైన ఛార్జీలు చెల్లించాలనడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కొనుగోలుదారులు వాపోతున్నారు.
సామాన్యునికి మోయలేని భారం...
కరోనా ప్రభావంతో సతమతమమైన రియల్ ఎస్టేట్ రంగానికి ఈ రేట్లు కాస్త భారం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో కోడలు, అల్లుడికి గిఫ్ట్ డీడ్ రూపంలో చేసే రిజిస్ట్రేషన్ల పద్ధతిని... ప్రస్తుతం కేవలం రక్త సంబంధం ఉన్న వారికి మాత్రమే పరిమితం చేశారని దీని వల్ల కూడా కొనుగోలుదారుల్లో కొంత గందరగోళం ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. మహిళల పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తే గత ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీని తగ్గించాయని.. ఇప్పుడున్న ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తే రిజిస్ట్రేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ వాల్యూ మాత్రమే పెంచితే కస్టమర్‌కు లాభం జరుగుతుందని.. శాతాన్ని పెంచడం వల్ల కేవలం ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్రం నిబంధనలు ప్రకారం స్టాంప్ డ్యూటీ కేవలం 5 శాతంలోపే ఉండాలని.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పెంచి ప్రజలపై భారం మోపుతోందని సామాజిక వేత్తలు ఆరోపిస్తున్నారు. భూముల వాల్యూ పెంచి... స్టాంప్ డ్యూటీ శాతాన్ని తగ్గిస్తే కొనుగోలుదారుడికి లబ్ది చేకూరుతుందని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.