Regional Ring Road Hyderabad : రాష్ట్రంలో ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి రూ.7,512 కోట్ల వ్యయం అవుతుందని తాజాగా కేంద్రం అంచనా వేసింది. భూసేకరణకు రూ.3 వేల కోట్లు, రహదారి నిర్మాణానికి రూ.4,512 కోట్లు వ్యయం కావచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. భూసేకరణ ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే.
6 వరుసల్లో నిర్మాణం..
Regional Ring Road Hyderabad expenditure : 158 కిలోమీటర్ల ఈ మార్గం ‘ఎన్‌హెచ్ 166 ఏఏ’ (సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- యాదాద్రి- భువనగిరి- చౌటుప్పల్)ని ఆరు వరుసల్లో నిర్మించడానికి వీలుగా భూసేకరణ చేపడతారు. తొలుత నాలుగు వరుసల్లో నిర్మిస్తారు. భవిష్యత్తులో మరో రెండు వరుసలు విస్తరిస్తారు. ఇందుకోసం సుమారు 4 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. అందులో 3,600 ఎకరాలు రహదారి నిర్మాణానికి, 400 ఎకరాలను జంక్షన్ల విస్తరణకు వినియోగిస్తారు. భూసేకరణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు రాష్ట్ర రెవెన్యూశాఖ దస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. అథారిటీ నియామకం పూర్తయ్యాక క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన భూమికి మార్కింగ్ చేసి వాస్తవిక విస్తీర్ణాన్ని నిర్ధారిస్తారు. ఆ తరవాత భూసేకరణకు సంబంధిత యజమానులకు నోటీసులు జారీచేస్తారు. సంక్రాంతి నాటికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, అధికారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని రెవెన్యూ అధికారి ఒకరు సోమవారం ‘ఈనాడు’తో చెప్పారు. భూసేకరణను 12 నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈలోగా రహదారి నిర్మాణానికి గుత్తేదారు ఎంపికకు టెండర్లు ఆహ్వానిస్తారని సమాచారం.