కంది పంటను రాష్ట్రంలో ఈ సీజన్‌లో 7 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు ఆరు క్వింటాళ్ల చొప్పున 43 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 25 శాతం కింద పది లక్షల క్వింటాళ్ల పంటను కొనాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం రాష్ట్ర లెక్కలను పక్కన పెట్టి అర్ధగణాంక శాఖ ముందస్తు దిగుబడుల అంచనాల నివేదికను పరిగణలోకి తీసుకుని కేవలం నాలుగు లక్షల 95 వేల క్వింటాళ్లు కొనేందుకు అనుమతిచ్చింది.
అమాంతం ధరలు తగ్గిస్తున్న వ్యాపారులు
ఈ మేరకు నాఫెడ్ తరఫున రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్యకు క్షేత్రస్థాయిలో కొనుగోలు బాధ్యతలు అప్పగించింది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. కేంద్రం కొనేది సుమారు 5 లక్షల క్వింటాళ్లే అని తేలగా.... కొండెక్కిన వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు.
మద్దతు ధర ఇవ్వడం లేదు
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మద్దతు ధరకు కొన్న రెండున్నర లక్షల క్వింటాళ్ల కందులు మార్క్‌ఫెడ్ వద్ద ఇంకా నిల్వ ఉన్నాయి. కొత్త పంట రాకముందేవీటిని అమ్మేయాలి. ఇటీవల టెండర్లు పిలిస్తే మార్కెట్‌లో కంది పప్పుకు గిరాకీ లేదని వ్యాపారులు ముందుకు రాలేదు. ధర తగ్గించి కొనుగోలుకు నిబంధనలను మార్చాలని మార్క్‌ఫెడ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్క్‌ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ లేఖ రాసింది. ఇక రేపోమాపో అనుమతి వస్తే వీటిని తక్కువ ధరకు అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవి మార్కెట్‌లోకి వస్తే కొత్త పంటకు మరింత ధర తగ్గించాలనే వ్యూహంతో వ్యాపారులున్నారు. ఇప్పటికే కొత్త పంటకు వారు మద్దతు ధర ఇవ్వడంలేదు. క్వింటాల్ మద్దతు ధర 5వేల 800 కాగా... వెయ్యి రూపాయలు తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు