తెలంగాణ

telangana

ETV Bharat / city

visakha steel: అగమ్యగోచరంగా ఉక్కు నియామక ప్రక్రియ - విశాఖ ఉక్కు ఆందోళన

ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఓవైపు.. పరిశ్రమలో ఉద్యోగం వస్తుందో, రాదో అని తెలియని భయం మరో వైపు ఉద్యోగులకు కంటినిండా కునుకు లేకుండా చేస్తోంది. నియామక ప్రక్రియ అగమ్యగోచరంగా మారడంతో.. ఉద్యోగులు ఆందోళనకరంగా ఉన్నారు.

recruitment-process-is-slow-at-visakha-steel
recruitment-process-is-slow-at-visakha-steel

By

Published : Jul 17, 2021, 3:33 PM IST

ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాలు కలగానే మారనున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశం కర్మాగార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటీకరణే జరిగితే కొత్త ఉద్యోగాలు రాకపోగా... ఉన్న ఉద్యోగాలకు కూడా కోతపడుతుందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఉక్కు కర్మాగారం ఉత్పత్తి క్రమంగా పెరుగుతున్నప్పటికీ... ఉద్యోగుల సంఖ్యమాత్రం తగ్గుతూ వస్తోంది.

సంస్థను 7.3 మిలియన్‌ టన్నులకు విస్తరించే ప్రక్రియ కూడా పూర్తయింది. ఆ మేరకు పెరిగిన పనిభారాన్ని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న పలువురికి అప్పజెప్పినప్పటికీ కొన్ని పోస్టులను భర్తీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృత కసరత్తు చేసి రెండు విడతలుగా 245 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(188+57) పోస్టులకు గత సంవత్సరం ఉద్యోగ ప్రకటన వెలువరించారు. కొవిడ్‌ కారణంగా ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయడానికి జాప్యం అయింది.

ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 24న పరీక్ష నిర్వహించారు. పోస్టుల భర్తీకి ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాత పరీక్షలో ఎంపికైన సుమారు 750 మందిని ప్రస్తుత సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇంటర్వ్యూలకు పిలిచారు. ఎంపికైన వారికి నెల రోజుల్లో పోస్టింగులు కూడా ఇస్తారనే ప్రచారం సాగినా... అడుగు ముందుకు పడలేదు.

ప్రైవేటీకరణ ప్రక్రియతో....

జనవరి నెలాఖరులో ఉక్కు ప్రైవేటీకరణ అంశం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆందోళనలు ఉద్ధృత రూపం దాల్చాయి. అయినప్పటికీ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పలువురు అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఖాయమేనని భావించారు. ఇంటర్వ్యూలు ముగిసి నెలలు గడుస్తున్నా నేటికీ ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉక్కులో ఉద్యోగాలపై ఆశపెట్టుకుని వేయి కళ్లతో వారు ఎదురుచూస్తూనే ఉన్నారు. మరో వైపు...ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా సిద్ధంగా ఉందని, మంత్రిత్వశాఖ అనుమతి కోసమే ఎదురుచూస్తున్నామని కర్మాగార వర్గాలు పేర్కొంటున్నాయి.

పోస్టుల భర్తీ కీలకం

ఉక్కు కర్మాగారంలోని పలు కీలక విభాగాల్లో ఖాళీలున్నాయి. రాబోయే రెండేళ్లలో సుమారు 700 మంది వరకు ఉద్యోగ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఉద్యోగాల భర్తీ అనివార్యంగా కనిపిస్తోంది. తగిన అనుభవం ఉన్నవారు అవసరం. అయినప్పటికీ ఆయా పోస్టుల భర్తీలో అంతులేని జాప్యం విమర్శలకు తావిస్తోంది.

దివ్యాంగులకూ నష్టమే

ప్రభుత్వరంగ సంస్థ కావడంతో సామాజిక బాధ్యత కింద కంటిచూపు లేనివారికి, నడవలేని స్థితిలో ఉన్నవారికి, వినికిడి లోపం ఉన్నవారికి, పలు రకాల వైకల్యాలు ఉన్నవారికి ఆ ఉద్యోగ ప్రకటనలో సుమారు 11 పోస్టులు కేటాయించారు. ప్రైవేటీకరణ జరగకపోతే వారికి ఉద్యోగాలొచ్చి ఆర్థిక ఆసరా దొరికినట్లయ్యేది. నియామక ప్రక్రియ ఆలస్యంతో ఆ ఆశలు ఊగిసలాడుతున్నాయి.

ఇక్కడి పరిస్థితి వివరించినా..

ఉక్కు కర్మాగార పరిస్థితిపై అవగాహన ఉన్న సంస్థ ఉన్నతాధికారులు ఆయా పోస్టుల భర్తీ చేపట్టాలని సిఫార్సు చేస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు. ప్రైవేటీకరణ ప్రక్రియపై వేగంగా పావులు కదుపుతున్న మంత్రిత్వశాఖ అధికారులు ఆయా పోస్టుల భర్తీకి సుముఖత చూపనట్లు తెలుస్తోంది. గత సంవత్సరం జనవరి 16న విడుదల చేసిన 188 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటనలో 72 పోస్టులు ఓపెన్‌ కేటగిరీకి(అన్‌ రిజర్వ్‌డ్‌)చెందినవి. 69 పోస్టులు ఓబీసీలకు, 24 పోస్టులు ఎస్సీలకు, 23 పోస్టులు ఆర్థికంగా వెనకబడిన వారికి కేటాయించారు.

ఇదీ చూడండి:

అఫ్గాన్​ మహిళకు పునర్జనిచ్చిన బెంగళూరు వైద్యులు!

ABOUT THE AUTHOR

...view details