తెలంగాణ

telangana

ETV Bharat / city

మార్కెట్​లో క్వింటా పసుపు రూ.41వేలు! - price for turmeric crop in telangana

మహారాష్ట్రలోని సాంగ్లీలో మంగళవారం రోజున పసుపు కొమ్ముల ధర రికార్డు స్థాయిలో పలికింది. ఓ రైతు తెచ్చిన పసుపు కొమ్ములు క్వింటా ఏకంగా రూ.41వేల చొప్పున అమ్ముడుపోయాయి.

record price for turmeric at sangli market in maharashtra
సాంగ్లీ మార్కెట్​లో క్వింటా పసుపు రూ.41వేలు!

By

Published : Mar 10, 2021, 7:04 AM IST

దేశంలోనే పసుపు పంటకు అత్యధిక ధర చెల్లిస్తున్న మార్కెట్‌గా పేరొందిన మహారాష్ట్రలోని సాంగ్లీలో మంగళవారం పసుపు కొమ్ముల ధర రికార్డు స్థాయిలో పలికింది. ఓ రైతు తెచ్చిన పసుపు కొమ్ములు క్వింటా రూ.41 వేల ధర చొప్పున అమ్ముడుపోయాయి. పంట నాణ్యత మెరుగ్గా ఉండటంతో పాటు రైతు పక్కాగా శుభ్రం చేసి తెచ్చినందున ఈ ధర వచ్చినట్లు సాంగ్లీ మార్కెట్‌ అధికారులు తెలిపారు. కేవలం 50 కిలోల బస్తా తేవడంతో దాన్ని ఓ వ్యాపారి రూ.20,500 చొప్పున చెల్లించి కొన్నారు. ఇతర రైతులకు సైతం రూ.12 వేల నుంచి రూ.24 వేల దాకా ధర లభించింది. ఇక్కడికి దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలు వస్తున్నందున మేలైన పంటకు అధిక ధర చెల్లిస్తున్నాయి.

నిజామాబాద్‌లో రూ.8,888

తెలంగాణలో నిజామాబాద్‌ అతి పెద్ద మార్కెట్‌ అయినా ధర క్వింటాకు రూ.8,888 వరకూ ఉంది. ఇక్కడకు రైతులు తెస్తున్న పంటను బాగా శుద్ధి చేయడం లేదని వ్యాపారులు ధర తగ్గిస్తున్నారు. ఈ నెల 8న నిజామాబాద్‌ మార్కెట్‌కు వచ్చిన 29 వేల క్వింటాళ్ల పసుపు పంటలో 15 వేల క్వింటాళ్లకే రూ.7 వేలకన్నా పైగా ధర లభించింది. ఇక మంగళవారం 10 వేల క్వింటాళ్లకు పైగా పసుపు రైతులు తేగా క్వింటాను రూ.4,500 నుంచి రూ.8,888 వరకూ చెల్లించి వ్యాపారులు కొన్నారు.

సిండికేట్‌ అవుతున్నారా?

నిజామాబాద్‌ మార్కెట్‌లో ఈనామ్‌ ద్వారా పసుపు పంట కొనుగోలు చేస్తున్నారు. ధరలను కోట్‌ చేసేముందు వ్యాపారులు కూడబలుక్కుని తగ్గించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తేమ 12 శాతం లోపుంటే ఎక్కువ ధర

రైతులు తెచ్చే పంటలో తేమ అధికంగా ఉంటున్నందున వ్యాపారులు ఎక్కువ ధరను కోట్‌ చేయడం లేదని నిజామాబాద్‌ మార్కెట్‌ గ్రేడ్‌-3 కార్యదర్శి విజయ్‌కిషోర్‌ చెప్పారు. పసుపులో తేమ 12 శాతంలోపే ఉంటే మంచి ధర వస్తుందన్నారు. ఉడకబెట్టిన పసుపు కొమ్ములను బాగా ఆరబెట్టి తెస్తేనే ధర పెరుగుతుందని ఆయన రైతులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details