Record income for TSRTC: రాష్ట్రంలో ప్రధాన పండగైన దసరా కోసం సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆర్టీసీ 4,198 ప్రత్యేక బస్సులను నడిపించింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదు. 15 రోజుల్లో సుమారు రూ.195 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దసరా పండుగ రోజున రూ.6 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తుంది. మిగిలిన రోజుల్లో ప్రతిరోజూ సరాసరిగా రూ.13 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.
అక్టోబర్ 6న 11.09 కోట్లు, 7న 14.91 కోట్లు, 8న రూ.14.97 కోట్లు వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అక్టోబర్ 9న 14.9 కోట్లు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అంచనా వేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఆర్టీసీకి 56.97 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 10వ తేదీన సోమవారం రోజున పాఠశాలలు, కళాశాలలు సెలవుల తర్వాత పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, విద్యార్థులు భారీ ఎత్తున తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఆదాయం కూడా సుమారు రూ.18 కోట్ల వరకు రావచ్చని అధికారులు అంచనావేస్తున్నారు.