ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / city

పురపోరు: 'సైకిల్' స్పీడ్ తగ్గడానికి కారణాలేంటి? - Municipal Elections Latest News

ఏపీ పుర ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు 'గాలి' వీచింది. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ఎక్కడా ఆశించిన ఫలితం దక్కలేదు. కారణాలు ఏమైనా ఊహించని పరాభవం ఎదురైంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు.. ఎక్కడా తెదేపా అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది. క్యాడర్​లో నిరాశ, నియోజకవర్గ స్థాయి నేతల నిర్లక్ష్యం, వర్గపోరు, అధికార పార్టీకి ఉన్న అన్ని రకాల బలాల కారణంగా పట్టున్నచోట్ల కూడా తెదేపా ఆధిక్యం కానరాలేదు.

TDP
TDP
author img

By

Published : Mar 14, 2021, 10:22 PM IST

ఏపీ పురపాలక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలోనూ తెదేపా పట్టు కోల్పోయినట్టు కనిపించింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ ప్రాంతానికి ఎంత మేలు చేశామని అధినేత చంద్రబాబు పదేపదే చెప్పినా.. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో సైకిల్ హవా కనిపించలేదు. తెదేపా ఎమ్మెల్యేలున్న చాలా నియోజకవర్గాల్లోనూ వ్యతిరేక తీర్పులు వచ్చాయి.

స్థానిక నాయకత్వం పట్టు కోల్పోయిందా..?

స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం స్థానిక నాయకత్వమే కీలకం. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువచోట స్థానిక నాయకత్వం చేతులెత్తేసింది. తెదేపాలో మంత్రులు, ఇతర హోదాల్లో పనిచేసిన వారు కూడా చురుగ్గా పోరాడలేకపోయారు. మొదటి నుంచీ ఎన్నికల్లో వైకాపా దూకుడుగానే వ్యవహరించింది. అధికార పక్షంగా.. అధికార వర్గాల నుంచి వచ్చిన అండదండలతో పాటు.. అన్నిచోట్లా దాదాపు వారి ప్రజాప్రతినిధులే ఉండటంతో.. స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయగలిగారు. తెదేపాలో నియోజకవర్గస్థాయి ఇన్​ఛార్జులుగా ఉన్నవారు దీనిని సరిగ్గా ఎదుర్కోలేకపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో 100శాతం ఏకగ్రీవాలు జరుగుతున్నా.. అడ్డుకోలేని పరిస్థితి. మెజార్టీ స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో వార్డులను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా వైకాపా ముందుగానే విజయాన్ని ఖాయం చేసుకుంది.

ఆధిపత్య పోరు...

తెలుగుదేశం ఆశలు పెట్టుకున్న స్థానాల్లో కూడా ఆధిపత్య పోరు దెబ్బతీసింది. ఈ కారణంగానే విజయవాడలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. బెజవాడ కార్పొరేషన్‌లో చంద్రబాబు ప్రచారానికి రావడానికి ముందు రోజే బుద్దా వెంకన్న, బొండా ఉమ, నాగుల్‌ మీరా... స్థానిక ఎంపీ కేశినేనిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఎన్నికలకు కొన్నిరోజుల ముందు జరిగిన ఘటన స్థానిక నాయకత్వంలో అనైక్యత ఎంత ఉందో చాటింది. ఒక్క విజయవాడకే ఇది పరిమితం కాలేదు. చాలాచోట్ల జరిగింది.

అధినేతకు రాంగ్ ఫీడ్​బ్యాక్..!

ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబు దాదాపు అన్ని జిల్లాల నేతలతో మంతనాలు జరిపారు. అప్పుడు అధినేతకు అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేతలు... ఆ తర్వాత అనుకున్న స్థాయిలో పని చేయలేదు, చేయించలేదు. సరైన ప్లాన్​తో ముందుకు వెళ్లలేదు. ఈ కారణంగా వారిపై ఆధారపడిన అభ్యర్థులు పలుచోట్ల చుక్కలు చూశారు. పార్టీ మేనిఫెస్టో తయారుచేయడం మొదలు... ప్రచారం ముగిసి ఓటర్లను ఆకట్టుకునే వరకు తెదేపా నేతలు ఇంతకముందులా పని చేయలేకపోయారు.

ఏం చెబుతున్నాయీ ఫలితాలు...?

వచ్చిన ఫలితాలపై తెదేపా విశ్లేషణ జరుపుతోంది. పట్టణ ప్రాంతాల్లో తమకు పట్టు ఉంటుందని తెలుగుదేశం పార్టీ భావించింది. ఉక్కు ఆందోళనలతో విశాఖలోనూ.. అమరావతి అంశం వల్ల విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో తమకు ఆధిక్యం వస్తుందని ఆ పార్టీ ఆశించింది. పట్టణ ప్రాంతాల్లో వైకాపా సత్తా చాటడం తెదేపాను నైరాశ్యంలోకి నెట్టింది. పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని.. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ.. దానిని ప్రదర్శించేలా విద్యావంతులు ఓటింగ్​లో పాల్గొనలేదని తెదేపా భావిస్తోంది. ఎక్కువశాతం మున్సిపాలిటీల్లో వైకాపా అధికార దుర్వినియోగంతో పాటు.. స్థానిక నాయకత్వం గట్టిగా పోరాడకపోవడం వల్లే ఓటమి చెందామని తెదేపా భావిస్తోంది. అన్ని ప్రాంతాల వారీగా ఓట్ల శాతాన్ని విశ్లేషించుకుని భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది.

ఇదీ చదవండి :ఏపీ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా ఏకపక్ష విజయం

ABOUT THE AUTHOR

...view details