తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ జవాన్లు కాలేమనే.. సికింద్రాబాద్​ విధ్వంసం..! - అగ్నిపథ్‌

Agnipath Protest: అగ్నిపథ్‌ అమల్లోకి వస్తే ఏజ్‌బార్‌ అవుతుందని.... ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తాము ఆర్మీ జవాన్లు కాలేమనే ఉద్దేశంతో.... సికింద్రాబాద్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారని రైల్వే పోలీసులు తెలిపారు. బిహార్‌లాగా రైళ్లను తగలబెడదామని కుట్రకు తెరతీశారని... అందుకు డిఫెన్స్‌ అకాడమీలు సహకరించాయని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆవుల సుబ్బారావు సహా డిఫెన్స్‌ అకాడమీలపై పాత్రపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Reason behind secunderabad protest against agnipath
Reason behind secunderabad protest against agnipath

By

Published : Jun 21, 2022, 2:40 AM IST

Updated : Jun 21, 2022, 5:09 AM IST

ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ జవాన్లు కాలేమనే.. సికింద్రాబాద్​ విధ్వంసం..!

Agnipath Protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు యువకులను రెచ్చగొట్టడంతోనే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసానికి కుట్ర పన్నారని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తేల్చారు. ఈమేరకు రైల్వే కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. అగ్నిపథక్‌ వ్యతిరేకంగా బిహార్‌లో జరిగిన అల్లర్లను... కొన్ని డిఫెన్స్ అకాడమీలు.. వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేశాయని... వాటిని చూసి ప్రేరణ పొందిన యువకులు.. 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని పోలీసులు తెలిపారు. అగ్నిపథ్‌ వల్ల ఏజ్‌బార్‌ అవుతుందని... ఇంకెప్పుడూ జవాన్‌ అయ్యే అవకాశం రాదని రెచ్చగొట్టారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూపు, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్, చలో సికింద్రాబాద్ ఏఆర్ఓ 3 గ్రూప్, ఆర్మీ జీపీ 2021 మార్చి ర్యాలీ గ్రూపు, సీఈఈ సోల్జర్స్ గ్రూప్.... ఇలా పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా విధ్వంసం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్దామని సందేశాలు పోస్ట్‌ చేశారని రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు.

లోకో ఇంజన్లకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారని... అందుకే కాల్పులు జరిపినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కాల్పుల్లో దామెర రాకేశ్‌ మృతిచెందగా... గాయపడినవారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ కేసులో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన మధుసూదన్ ప్రధాన సూత్రధారిగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. నిందితులకు సంబంధించిన దాదాపు 43 చరవాణిలు స్వాధీనం చేసుకొనివాటిని విశ్లేషించారు. విధ్వంసం వల్ల 20కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 45మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో 11 మంది కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో చాలా మంది 20ఏళ్ల వయస్సుఉన్నవారే ఉన్నారు.

విధ్వంసానికి ఏయే డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిర్వాహకులు సహకరించారనే అంశంపై వివరాలను సేకరిస్తున్నారు. రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న ఆర్మీ డిఫెన్స్‌ అకాడమీల ప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1500మంది యువకులను సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి పదికిలోమీటర్ల దూరంలో ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీని నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కుట్రలో భాగస్వామిగా ఉన్నాడన్న అనుమానంతో రైల్వేపోలీసులు సమాచార సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. జూన్‌ 16న 1500మంది యువకులు మల్కాజిరిగి, నేరేడ్‌మెట్, ఏఎస్‌రావునగర్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్నారని సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా ఆధారాలు లభించాయి. వీరికి వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించింది ఆవుల సుబ్బారావేనని పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన 13 మందిలో 9 మందిని వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశార్జ్‌ అయినవారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది.


ఇవీ చూడండి:

Last Updated : Jun 21, 2022, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details