భాగ్యనగరంలో నిర్మాణ రంగం(Construction Field in Hyderabad) దూకుడు పెరిగింది. మూడో త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా ఆఫీసు స్పేస్ విక్రయాల్లో(Office Space Sales) పూణె, అహ్మదాబాద్‌ల తరువాత స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా యాభై లక్షల నుంచి కోటి రూపాయల మధ్య విలువైన ఇళ్ల అమ్మకాలు స్వల్పంగా పెరగగా.. హైదరాబాద్, చెన్నై నగరాల్లో రెండు శాతం ధరలు పెరిగినట్లు నైట్‌ఫ్రాంక్ సర్వేలో వెల్లడైంది.
కొత్త ప్రాజెక్టుల ప్రారంభాల్లో నంబర్ వన్..
కొవిడ్‌తో దెబ్బతిన్న భారతదేశ స్థిరాస్తి రంగం(Construction Field in Hyderabad) క్రమంగా పుంజుకుంటోంది. గత ఏడాది మూడో త్రైమాసికంలో జరిగిన అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలతో పోలిస్తే దేశ వ్యాప్తంగా నిర్మాణాలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం(Real Estate) దూకుడు మరింత పెరిగింది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం జులై నుంచి సెప్టెంబర్ వరకు స్థిరాస్తి రంగం స్థితిగతులను అంచనా వేసిన నైట్ ఫ్రాంక్ సంస్థ ఇటీవల ఆ నివేదిక వెల్లడించింది.
ఆఫీస్ స్పేస్‌లో నంబర్ 3..
గతేడాది మూడో త్రైమాసికంలో ప్రాజెక్టుల ప్రారంభాలతో పోలిస్తే.. ఈ ఏడాది 9,256 ప్రారంభాలతో ఏకంగా 650 శాతం వృద్ధిని కనబరచి హైదరాబాద్ మహానగరం మొదటి స్థానంలో నిలిచింది. ఇళ్ల అమ్మకాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే ముందు వరుసలో హైదరాబాద్ నిలిచింది. గతేడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 5,987 ఇళ్లను అమ్మి 272 శాతం వృద్ధి నమోదు చేసింది. ఆఫీస్ స్పేస్ అమ్మకాల్లోనూ పూణె, అహ్మదాబాద్‌ల తరువాత హైదరాబాద్ మెట్రో నగరం మూడో స్థానంలో నిలిచింది.
8 నగరాలు.. 12.5 మి.చ.అ. ఆఫీస్ స్పేస్..
దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల పరిధిలో 12.5 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం ఆఫీస్ స్పేస్ అమ్మకాలు(Office Space Sales) జరిగాయి. అందులో బెంగుళూరులో అత్యధికంగా 4.3 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ అమ్ముడుపోగా.. హైదరాబాద్ మెట్రో నగరంలో ఈ త్రైమాసికంలో 2.1 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ విక్రయాలు(Office Space Sales) జరిగాయి. 2020 సంవత్సరం మూడో క్వార్టర్‌లో యాభై లక్షల లోపు విలువ చేసే ఇళ్లు 45 శాతం అమ్ముడుపోగా.. ఈ ఏడాది అదే సమయంలో 43 శాతానికి తగ్గాయి. యాభై లక్షల నుంచి కోటి రూపాయిలు విలువ చేసే ఇళ్ల అమ్మకాలు 2020 మూడో త్రైమాసికంలో 32 శాతం ఉండగా....ఈ క్వార్టర్‌లో అది 35 శాతానికి స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది. కోటి రూపాయలకు పైన విలువ చేసే ఇళ్ల అమ్మకాలు తటస్థంగా ఉన్నాయి.
ధరల విషయంలో... హైదరాబాద్, చెన్నైలలో రెండు శాతం, కోల్‌కతా ఒక్క శాతం పెరుగుదల నమోదైంది. దిల్లీ, పూణెలలో ఒక్కశాతం, ముంబయిలో రెండు శాతం ధరలు తగ్గాయి.