ఏపీ రాష్ట్ర శాసనమండలిలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ జులై 1న రాజీనామా చేయటంతో మండలిలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికే ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచే వారి పదవీకాలం 2023 మార్చి 29 వరకు ఉంటుంది.
బోస్ స్థానం పదవీకాలం ఏడాది లోపే.. 2021 మార్చి వరకే ఉన్నందున ఉప ఎన్నిక నిర్వహించట్లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా కాబట్టి శాసనసభలో బలం ఆధారంగా ఈ స్థానాన్ని అధికార వైకాపా దక్కించుకోనుంది. అభ్యర్థిత్వం కోసం నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
చేతివృత్తిదారుల వర్గాలకు చెందిన నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. జగన్ హామీ ఇచ్చినందున గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్, మరోవైపు కాపు కోటాలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఉప ఎన్నిక ప్రకటన ఆగస్టు 6న వెలువడనుంది. నామినేషన్ స్వీకరణ గడువు ఆగస్టు 13 వరకు, నామపత్రాల ఉపసంహరణకు 17 వరకు అవకాశం ఉంటుంది. ఆగస్టు 24న పోలింగు, అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటాయని ఈసీ వెల్లడించింది.