దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. డెబిట్, క్రెడిట్ కార్డులు క్లోనింగ్ చేసి బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్ము దోచేయడం లాంటి ఘటనల నేపథ్యంలో ఆర్బీఐ క్రెడిట్ డెబిట్ కార్డుల లావాదేవీలపై ఆంక్షలు విధించింది. కొత్తగా జారీచేసిన ఈ మార్గదర్శకాలు అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయి.
కార్డుదారుడు కోరుకుంటే తప్ప అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు.. కార్డుల ద్వారా చెయ్యడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ లావాదేవీలు, కార్డు చెల్లింపులను సురక్షితం చేసేందుకే కొత్త మార్గదర్శకాలు.. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. డిజిటల్ లావాదేవీల్లో ముందుకు వెళుతున్న ఈ సమయంలో ఆర్థిక సైబర్ నేరాల కట్టడికి ఈ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొంది. డెబిట్, క్రెడిట్ కార్డులను ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ వద్ద మాత్రమే లావాదేవీల చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డెబిట్, క్రెడిట్.. రెండింటిలో కార్డ్ హోల్డర్లు లావాదేవీల పరిమితిని విధించుకోడానికి కొత్తగా అవకాశం కల్పించింది.