ఏపీలోని చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు కట్ట తెగేపోయే ప్రమాదం(Leakage from Rayala Cheruvu in chittoor district) పొంచిఉంది. చెరువు కట్టకు స్పల్ప గండి పడటంతో వరద నీరు కట్ట నుంచి మట్టి జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రాయలచెరువు వద్దకు చేరుకున్న కలెక్టర్ హరినారాయణ్.. గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు వద్ద గల పరిస్థితిని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు.
రాయల చెరువు కట్ట తెగితే సుమారు వంద గ్రామాలకు ముంపు ప్రమాదం(Danger in Rayala Cheruvu catchment area) పొంచి ఉంది. దీంతో.. రాయల చెరువు నీటి సామర్థ్యం తగ్గించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. చెరువు దిగువ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరు, గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరు, వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో ప్రజలను అప్రమత్తం చేశారు. పల్లెలను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.