తెలంగాణ

telangana

ETV Bharat / city

టోకెన్ విధానంలో రేషన్ బియ్యం​ పంపిణీ... - coronavirus news

రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగింది. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు... సత్వర చర్యగా ప్రభుత్వం బియ్యం అందజేస్తోంది. అన్ని గ్రామాలు, పట్టణాల్లోనూ లబ్ధిదారులు ఉదయం నుంచే బారులు తీరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా డీలర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేషన్ దుకాణాల్లో టోకెన్ విధానం అమలు చేసి... రోజూ 100 మంది చొప్పున అందజేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులు నిర్ణయించారు.

ration rice distribution
ration rice distribution

By

Published : Apr 1, 2020, 7:02 PM IST

ఆంక్షల కారణంగా రాష్ట్రంలో ఎవరూ ఆకలితో పస్తులుండకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో... రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండ, దత్తాత్రేయకాలనీలో రేషన్ దుకాణం వద్ద ప్రజలు ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇల్లెందులో ఆందోళన

సంగారెడ్డిలో డీలర్లు ప్రజలను సామాజిక దూరంలో ఉంచి బియ్యం పంపిణీ చేశారు. చేతులను శుభ్రపరుచుకున్నాకే... దుకాణాల్లోకి అనుమతించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో బియ్యం నాసిరకంగా ఉందంటూ లబ్ధిదారులు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. పురుగులున్న బియ్యం వల్ల అనారోగ్యానికి గురవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన బియ్యాన్ని అందజేయాలని కోరారు.

అన్ని చర్యలు తీసుకున్నాం

ఆసిఫాబాద్‌లోని బజార్‌వాడి రేషన్‌దుకాణంలో జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి బియ్యం పంపిణీని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందజేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో సామాజిక దూరం పాటిస్తూ లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ బియ్యం పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు... పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఈనెల 10వరకు రేషన్‌ బియ్యం పంపిణీ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. తమకు కేటాయించిన రోజునే రేషన్‌దుకాణాలకు వచ్చి లబ్ధిదారులు బియ్యం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:చైనాలో కరోనా 2.0​.. ఈసారి మరింత విచిత్రంగా...

ABOUT THE AUTHOR

...view details