Ratha Saptami at Aravalli Temple : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సూర్య జయంతి ఉత్సవాలు కోలాహలంగా సాగనున్నాయి. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అరసవల్లి సూర్యభగవానుడికి తొలి పూజ చేయనున్నారు. స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి...
'రథసప్తమి రోజున స్వామి దర్శనానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు 600 మంది దాతలు వచ్చారు. వారికి శనివారం నుంచి పాస్‌లు అందజేస్తున్నాం. 5వ తేదీలోపు ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందించివారందరికీ పాస్‌లు మంజూరు చేశాం. దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో వేడుకను విజయవంతం చేస్తాం.'
- వి.హరిసూర్యప్రకాశ్, ఈవో, ఆదిత్యాలయం
సేవలివీ..
- విశాఖకు చెందిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామిజీ మొదటిగా క్షీరాభిషేకం చేయనున్నారు.
- విశేష అర్చనలు, ద్వాదశహారతి, మహానివేదన, పుష్పాలంకరణ సేవలు ఉంటాయి.
- మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు నిజరూప దర్శనం కల్పిస్తారు.
- 6 గంటలకు విశేషార్చన ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఏకాంతసేవ జరుగుతుంది.
దర్శనానికి ఇలా వెళ్లాలి..
- వీవీఐపీ, దాతలు, రూ.500 టిక్కెట్ లైన్లు ఆర్చిగేట్ సమీపంలో ప్రారంభమవుతాయి.
- ఉచిత, రూ.100 టికెట్లు క్యూలైన్లలోకి శ్రీశయనవీధి రహదారి గుండా వెళ్లాలి.
- మధ్యలో కేశఖండనశాలకు వెళ్లాలంటే వేరేగా నిర్మించిన క్యూలైనులో వెళ్లి అరసవల్లిలోని మున్సిపల్ హైస్కూల్‌లో మొక్కులు తీర్చుకోవచ్చు.
- అనంతరం అక్కడ సమీపంలో నిర్మించిన ప్రత్యేక క్యూలైన్‌లో కలవాలి.
- భక్తులను నియంత్రించేందుకు ఉచిత క్యూలైనులో 35 బాక్స్‌లుగా బారికేడ్లను నిర్మించారు. ఒక్కో బాక్స్‌లో వంద మందికిపైగా ఉండేటట్లు ఏర్పాటు చేశారు. ముందున్న బాక్స్ ఖాళీ అవుతుంటే వెనుక ఉన్నదాంట్లోని భక్తులను పంపుతారు.
- వృద్ధులు, దివ్యాంగులు ఆర్చిగేట్ వద్ద రెవెన్యూ సిబ్బందిని సంప్రదిస్తే దర్శనానికి పంపుతారు.
600 మందితో బందోబస్తు..