తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2021, 10:36 PM IST

ETV Bharat / city

శరవేగంగా పోలవరం స్పిల్​వే గేట్ల అమరిక

ఏపీలోని పోలవరం ప్రాజెక్టులో అతికీలకమైన స్పిల్‌వే గేట్ల అమరిక శరవేగంగా జరుగుతోంది. వచ్చే వర్షాకాలం నాటికల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పనులు పూర్తి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్ ప్రారంభం కాగా.. అధిక శాతం గేట్ల అమరిక పూర్తి చేశారు.

polavaram news, polavaram latest news
శరవేగంగా పోలవరం స్పిల్​వే గేట్ల అమరిక

శరవేగంగా పోలవరం స్పిల్​వే గేట్ల అమరిక

ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైన స్పిల్ వే గేట్ల అమరిక పూర్తి కావస్తోంది. అధిక శాతం పనులు తుది దశకు చేరుకున్నాయి. గేట్ల అమరిక, హైడ్రాలిక్ సిలిండర్లు, పవర్ ప్యాక్ ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 44, 43 గేట్ల ట్రయల్ రన్ చేపట్టారు. ఈ రెండు గేట్లను హైడ్రాలిక్ సిలిండర్ల సాయంతో పైకి ఎత్తి, కిందకు దించి పరీక్షించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా గేట్లు పైకి, కిందకు కదిలాయి. హైడ్రాలిక్ సిలిండర్ల సాయంతో గేట్ల కదలిక చేపట్టిన దేశంలోనే తొలి ప్రాజెక్టుగా ప్రాజెక్టు రికార్డు సృష్టించింది. స్పిల్ వేకు మొత్తం 48గేట్లు అమర్చాల్సి ఉండగా.. 34 బిగించారు. మిగిలిన మరో 14 అమర్చాల్సి ఉంది. 48 గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చాల్సి ఉండగా.. 56 బిగింపు పూర్తైంది. 1,128 మీటర్ల మేర స్లాబ్ పనులు పూర్తి చేశారు.

హైడ్రాలిక్ సిలిండర్లే ప్రధానం....

స్పిల్‌వే గేట్ల అమరికలో ఈ హైడ్రాలిక్ సిలిండర్లే ప్రధానమైనవి. పవర్ ప్యాక్‌ల సాయంతో ఈ హైడ్రాలిక్ సిలిండర్లు పని చేస్తాయి. వీటి సాయంతో 300టన్నుల బరువు కలిగిన గేటు ఒక్కో నిమిషానికి 1.5మీటర్ల మేర పైకి లేపగలిగేందుకు వీలుంది. ఒక్కో గేటు ఎత్తేందుకు, దించేందుకు రెండు హైడ్రాలిక్ సిలిండర్లు అమరుస్తారు. ఒక్కో హైడ్రాలిక్‌ సిలిండర్‌ బరువు 20మెట్రిక్ టన్నులు, పొడవు 17.30మీటర్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకొన్నారు. హైడ్రాలిక్ సిలిండర్ల అమరికలో జర్మనీకి చెందిన మౌంట్ అనే సంస్థ సాంకేతిక సాయం అందిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోనే ఉంటూ.. సిలిండర్ల బిగింపులో సాంకేతిక సాయం అందిస్తున్నారు. రెండు గేట్లకు ఒక్కో పవర్ ప్యాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం 24పవర్ ప్యాక్ లు అమర్చాల్సి ఉండగా.. 5పవర్ ప్యాక్‌ల పనులు పూర్తయ్యాయి. మిగితా పవర్ ప్యాక్ హౌస్‌ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి.

ఒక్కొగేటు బరువు 2 వేల 400 టన్నులు...

పోలవరం భారీ ప్రాజెక్టులో అమర్చుతున్న ఒక్కో గేటు 2వేల 400టన్నుల బరువును తట్టుకొనే సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి నదిలో వచ్చే భారీ వరద పోటును నియంత్రించేలా వీటి నిర్మాణం చేపట్టారు. నదిలో ఒక్కసారిగా పెరిగే వరదను దృష్టిలో ఉంచుకొని గేట్లను తెరిచేందుకు ఈ హైడ్రాలిక్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికే మిగిలిపోయిన ఎగువ కాఫర్ డ్యామ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాకాలం సీజన్ నాటికి నదిని స్పిల్ వేపై మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ముంపు బాధితులను తరలించేందుకు ఏర్పాట్లు...

మే నెల నుంచి 41. 5 కాంటూరు పరిధిలోని నిర్వాసిత గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడంపై దృష్టి పెట్టారు. అటు తూర్పు గోదావరి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలను తరలిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిర్వాసితులకు పునరావాసాల ఏర్పాటు పూర్తి చేసి.. తరలిస్తామని చెబుతున్నారు. కాఫర్ డ్యామ్ 70 శాతం పూర్తి కావడం వల్ల.. గత రెండు సీజన్లలో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామాల్లోకి వరద నీరు చేరి.. రెండు నెలల పాటు సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ వర్షాకాల సీజన్ నాటికి కాఫర్ డ్యామ్ పూర్తిగా మూసేయడం వల్ల.. 41.5 కాంటూరు పరిధిలోని గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కొవిడ్​ పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details