'ది వైర్' వెబ్‌సైట్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు ఇన్‌జంక్షన్ ఉత్తర్వులు జారీచేసింది. భారత్ బయోటెక్, కొవాగ్జిన్ టీకాపై ప్రచురించిన 14 కథనాలను... నోటీసులు అందిన 48 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. భవిష్యత్తులోనూ భారత్ బయోటెక్ కంపెనీ, డైరెక్టర్లు, ఉద్యోగులు, ఏజెంట్లు, ఉత్పత్తుల పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి కథనాలు ప్రచురించరాదని.. మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తమ కంపెనీతోపాటు తాము ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్‌పై.. ఎలాంటి ఆధారాలు లేకుండా ది వైర్ వెబ్‌సైట్ రాసిన కథనాలను తొలగించేలా ఆదేశించాలని భారత్ బయోటెక్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా జడ్జి విచారణ చేపట్టారు. ది వైర్ వెబ్‌సైట్.. దురుద్దేశాలతో కంపెనీ ఉత్పత్తులపై కథనాలు రాసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ప్రభుత్వం... ఈ కంపెనీకే అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైర్ రాసిన రాతల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వేయించడానికి వెనుకంజవేసే ప్రమాదం ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారు.