రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. వనస్థలిపురంలో బుధవారం వరకు 18 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇవాళ ఎలాంటి కేసులు బయటపడలేదు. హుడాసాయినగర్ కాలనీలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న 11 మందిని జిల్లా అధికారులు గుర్తించారు. వారి నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రయత్నించగా నిరాకరించారు. హోం క్వారంటైన్లో ఉంటామని హామీ ఇచ్చారు. కరోనా లక్షణాలు బయటపడితే స్వయంగా తామే పరీక్షలు చేయించుకుంటామని చెప్పడం వల్ల ఆరోగ్య సిబ్బంది వెనుతిరిగారు.
అలాగే 4 కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్న వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది... జ్వరం, దగ్గు, ఇతరాత్ర అనారోగ్య సమస్యలున్నవారి వివరాలు సేకరిస్తున్నారు. వనస్థలిపురం, హయత్ నగర్, బీఎన్ రెడ్డి డివిజన్లలోని కంటైన్మెంట్ జోన్లు ఇంకా కొనసాగుతున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వనస్థలిపురం పరిధిలోని కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.