మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఎనిమిది క్షేత్రాల్లో, 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో రంగనాథస్వామి గుడి మొదటిదని అంటారు. కావేరీ నది ఒడ్డున నిర్మించిన ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో ఏడు ప్రహరీగోడలూ, 22 గోపురాలూ, తొమ్మిది తీర్థాలూ ఉన్నాయి. ఆసియాఖండం లోనే అత్యంత పెద్దదైన ఈ ఆలయ గోపురం 236 అడుగుల ఎత్తులో 13 అంతస్తులతో ఉంటుంది. దీని నిర్మాణం అచ్యుత దేవరాయలు ప్రారంభిస్తే ఆ తరువాత నలభై నాలుగో అహోబిల మఠాధిపతి అళగియ సింగర్ జీయర్‌స్వామి పూర్తి చేశారు.
స్థలపురాణం...
సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీహరి అనుగ్రహం పొందాలనుకుని సంకల్పిస్తే... దానికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు శ్రీరంగం అనే విమానంలో శయన రూపంలో విగ్రహంగా మారి బ్రహ్మకు దర్శన మిచ్చాడట. ఆ తరువాత ఇక్ష్వాకు మహారాజు తపస్సు చేసి... బ్రహ్మను మెప్పించి ఆ శ్రీరంగం విమానాన్ని వరంగా పొందాడట. అప్పటినుంచీ అయోధ్యను పాలించే ప్రభువు లంతా రంగనాథుడిని తమ ఇంటి దైవంగా పూజించేవారట. అలా ఎన్నో తరాలుగా తమ మందిరంలో దేవతార్చనలో ఉన్న శ్రీరంగం విమానాన్ని రాముడు విభీషణుడికి ఇస్తూ దాన్ని కిందపెట్టకూడదనీ, ఒకవేళ ఆ విమానానికి భూస్పర్శ తగిలితే అది కదలదనీ చెప్పాడట. విభీషణుడు ఆ విమానాన్ని పట్టుకుని లంకకు చేరుకునేందుకు సిద్ధమయ్యాడట. మార్గమధ్యంలో కావేరీ నదీ ఒడ్డుకు చేరిన విభీషణుడు నది మధ్యలో ఉన్న శ్రీరంగ ద్వీపంలో సంధ్యా వందనం చేసుకోవాలనుకున్నాడట. తన పూజ పూర్తయ్యేవరకూ విమానం పట్టుకునేందుకు ఓ మనిషికోసం వెతకడం మొదలుపెట్టాడట. ఇది తెలిసి దేవతలు స్వామిని శ్రీరంగంలోనే ఉంచేందుకు వినాయకుడిని పంపించారట. వినాయకుడు మారువేషంలో విభీషణుడికి ఎదురుపడితే తన సంధ్యావందనం పూర్తయ్యే వరకూ విమానాన్ని పట్టుకోమనీ, కింద పెట్టొద్దనీ చెప్పి అతడు పూజకు సిద్ధమయ్యాడట. అయితే... విమానం బరువుగా ఉందనీ తాను మోయలేననీ చెబుతూ వినాయకుడు నేలమీద పెట్టి వెళ్లిపోయాడట. ఆ విమానాన్ని విభీషణుడు ఎత్తలేకపోవడంతో... అతడికి రంగనాథస్వామి దర్శనమిచ్చి తనకు ఈ ప్రదేశం నచ్చిందనీ ఇక్కడి నుంచే అనుగ్రహిస్తాననీ చెప్పి విభీషణుడిని పంపించేశాడట. అలా అప్పటినుంచీ స్వామి శ్రీరంగంలో కొలువై... భక్తుల పూజలు అందుకుంటున్నాడని అంటారు.