తెలంగాణ

telangana

ETV Bharat / city

వైభవంగా సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. వేదపారాయణాల మధ్య అంకురార్పణ - ముచ్చింతల్ దివ్యక్షేత్రం

Sahasrabdhi Vedukalu Day1: సమతకు చిహ్నమైన దివ్యమూర్తి శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలతో శంషాబాద్‌లోని ముచ్చింతల్ దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు నిర్వహించిన శోభాయాత్రతో ప్రారంభమైన ఉత్సవాలకు చినజీయర్​ స్వామి చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది.

Ramanujacharya Sahasrabdhi Vedukalu Day1 in muccinthal
Ramanujacharya Sahasrabdhi Vedukalu Day1 in muccinthal

By

Published : Feb 2, 2022, 3:25 PM IST

Updated : Feb 2, 2022, 6:47 PM IST

వైభవంగా సహస్రాబ్ది ఉత్సవాలు ప్రారంభం..

Sahasrabdhi Vedukalu Day1: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లో శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే సమతామూర్తి ఉత్సవాలు.. తొలి రోజు పెరుమాళ్ల శోభాయాత్రతో మొదలయ్యాయి. త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేలాది మంది రుత్వికులు, పీఠాధిపతులు, ఆశ్రమ విద్యార్థుల శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రోచ్ఛరణతో పల్లకిలో పెరుమాళ్లు యాగశాలకు చేరుకున్నారు. వేడుకల్లో భాగంగా మొదలుపెట్టిన విశ్వక్ సేనుడి పూజ, వాస్తు శాంతి పూజ విజయవంతంగా జరిగింది.

చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో 9 మంది ప్రధాన అర్చకులు వాస్తు శాంతి పూజను నిర్వహించారు. యాగశాలలో సుమారు గంట పాటు వాస్తుశాంతి పూజను నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రాంగణంలో వాస్తు శాంతి చేసిన నేలను అర్చక బృందం అగ్నితో శుద్ధి చేసింది. యాగశాలకు వచ్చిన భక్తులకు వాస్తు శాంతి పూజ ప్రాధాన్యతను, అందులోని విశిష్టతను చిన్నజీయర్ స్వామి వివరించారు. సహస్రాబ్ది ఉత్సవాలకు వేదపారాయణాల నడుమ అంకురార్పణ జరింగింది. చినజీయర్​ స్వామి చేతుల మీదుగా జరిగిన ఈ అంకురార్పణకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హాజరయ్యారు.

5 వేల మంది రుత్వికులతో..

శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం పేరుతో నేటి నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న ఈ వేడుకల్లో.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 216 అడుగుల ఎత్తున నిర్మించిన రామానుజాచార్య విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించనున్నారు. ప్రతి రోజు సాయంత్రం విష్టు సహస్రనామ పారాయణం ఉంటుంది. ఆ తరువాత ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ 12 రోజుల మహాక్రతువులో ప్రధానమైన యాగశాలలో 1035 కుండాలలో మహాయజ్ఞం జరుగతుంది. ఈ మహాయాగాన్ని 5 వేల మంది రుత్వికులు నిర్వహిస్తున్నారు. వీరంతా... తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, కర్ణాటక సహా అమెరికా నుంచి వచ్చారు. యాగానికి అవసరమైన పదివేల పాత్రలను రాజస్థాన్ నుంచి తెప్పించారు. యాగశాలను.. వాలంటీర్లు అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దారు.

12 వేల మంది వాలంటీర్లు..

ఈ వేడుకల్లో సేవలందించేందుకు వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12 వేల మంది వాలంటీర్లు వివిధ దశల్లో భక్తులకు సేవలందిస్తున్నారు. అమెరికాలోని 15 రాష్ట్రాలతోపాటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 20 జిల్లాలు సహా మరో 18 రాష్ట్రాల నుంచి సేవకులు వచ్చారు. యాగశాల, సమతామూర్తి విగ్రహం, ఆహారశాలలు, మరుగుదొడ్లు వంటి వేర్వేరు చోట్ల వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు.

ప్రముఖులు వస్తున్న వేళ..

శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహానికి రాష్ట్రపతి, ప్రధాని సహా ముఖ్య అతిథులు హాజరుకానున్న వేళ... ప్రత్యేక హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం లేదా హెలికాప్టర్‌లో వచ్చే అవకాశాలు ఉండటంతో రెండు మార్గాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. గొల్లపల్లి వద్ద విమానాశ్రయం వెనకభాగంలో ఉన్న గోడను తొలగించిన అధికారులు... వీఐపీ మార్గాన్ని మూడు వరుసల్లో సిద్ధం చేస్తున్నారు. వీవీఐపీ మార్గంలోని పల్లెల్లో కొత్త కళ సంతరించుకుంది. నిన్నమొన్నటి వరకు సింగిల్ రోడ్డుగా ఉన్న మార్గాలన్నీ నాలుగు వరుసలుగా వెడల్పు చేయటం, కొత్త రోడ్లు వేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భద్రత కట్టుదిట్టం..

ఈ నెల 5న ప్రధాని మోదీ, 13న రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ ముచ్చింతల్ రానున్న నేపథ్యంలో... సమతామూర్తి కొలువుదీరిన స్ఫూర్తి కేంద్రాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వీవీఐపీ మార్గంతో పాటు జీవా ప్రాంగణం సమతామూర్తి కేంద్రం వద్ద సర్కార్ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. భద్రత, భక్తుల సేవ కార్యక్రమాలపై పోలీసులు ఉన్నతాధికారులు, సిబ్బందితో సమీక్షించిన చిన్నజీయర్ స్వామి.. పోలీసులు, వాలంటీర్లు సమన్వయంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంగణంలో వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి:

Last Updated : Feb 2, 2022, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details