పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి అదే స్థానంలో విధుల్లోకి తీసుకోవాలని తితిదే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. దాంతో ఎ.వి.రమణదీక్షితులు ప్రధాన అర్చకులుగా తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం ఏర్పడింది. ఆయనతో పాటు మరో 14 మంది తిరిగి అర్చకులుగా వచ్చేందుకూ మార్గం సుగమమైంది. 65 ఏళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ ఇస్తూ 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి తీర్మానించింది.
దీనికి అనుగుణంగా అప్పటి తితిదే ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణమూర్తి దీక్షితులుతోపాటు మరో 11 మంది పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరిలో విధులు నిర్వహించగలిగే శారీరక సామర్థ్యం ఉన్న వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ 2018 డిసెంబరులో హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉంది.
విధుల్లో చేరనున్న 14 మంది అర్చకులు!
అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని ఆయన ఇంటికి వెళ్లి రమణదీక్షితులు కలిశారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులును తిరిగి నియమిస్తామని జగన్ నాడు హామీ ఇచ్చారు. 2019లో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవో ఎంఎస్ నంబరు 439 ద్వారా అర్చకులకు పదవీ విరమణ లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు. రమణదీక్షితులును ప్రధాన అర్చకులుగా నియమిస్తారని భావించినా... తితిదే ఆగమ సలహామండలి గౌరవ అధ్యక్షుడిగా నియమించారు.