ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాల సౌరభాల్ని వెదజల్లే అపురూపమైన పర్వదినం- రాఖీపౌర్ణమి. సోదర సోదరీమణుల నిరుపమాన బాంధవ్యానికిది ప్రతిఫలనంగా విలసిల్లుతోంది. ‘రాకా’ అంటే నిండుదనం, పున్నమి. రాకా పున్నమినాడు ధరించే ‘రక్ష’ను రాఖీగా వ్యవహరిస్తున్నారు. సోదరుడికి సహోదరి శుభాకాంక్షలతో ధరింపజేసే రక్ష వల్ల వారిరువురికీ శ్రేయస్సు చేకూరుతుందని భవిష్యోత్తర పురాణం పేర్కొంది. ధర్మయుతంగా జీవిస్తూ, సోదరీమణులపై అవ్యాజమైన ప్రేమాభిమానాల్ని కనబరిచే సోదరులకు రక్షాబంధనం సర్వదా రక్షణగా నిలుస్తుందని విష్ణుపురాణం వెల్లడించింది.
రక్షాబంధనానికి ‘జయసూత్రం’ అనే పేరూ ఉంది. పాండవులకు విజయం చేకూరడానికి శ్రీకృష్ణుడి ఆధ్వర్యంలో ధర్మరాజు రక్షాబంధన వేడుక నిర్వహించాడని మహాభారతం ప్రస్తావించింది. రాఖీని ‘భక్తి కంకణం’గా భాగవతం అభివర్ణించింది. తన అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులతో శ్రీహరిని బలిచక్రవర్తి ప్రసన్నం చేసుకున్నాడు. భక్తి బంధంతో విష్ణువును తన వశం చేసుకున్నాడు. లక్ష్మీదేవి తల్లడిల్లింది. బలిచక్రవర్తిని సోదరుడిగా భావిస్తూ రక్షను ధరింపజేసింది. ఏం కావాలో కోరుకొమ్మన్నాడు బలి. తన పతిని కానుకగా లక్ష్మి ఇవ్వమని కోరింది. తథాస్తు అన్నాడు బలి. విష్ణువునే లక్ష్మి బహుమతిగా అందుకున్న విశేష పర్వదినమే- శ్రావణపౌర్ణమి.
మహాగణపతి మానసపుత్రికగా ‘సంతోషి’ అభివ్యక్తమైంది శ్రావణ పౌర్ణమినాడేనని గణేశ పురాణం వివరించింది. లాభక్షేమాల కోసం సోదరీమణుల్ని సర్వదా సోదరులు ఆదరించాలని, వారి చేత పవిత్ర బంధనాన్ని ధరింపజేసుకోవాలని ఈ పురాణం సూచించింది. విష్ణువు రక్ష స్థితికారకుడు. విష్ణు జన్మనక్షత్రమైన శ్రావణం, పూర్ణిమ తిథితో సమ్మిళితమై ఉన్నరోజే శ్రావణ పౌర్ణమి. ఈ రోజున విష్ణుశక్తి రక్షాబంధనాల్ని ఆశ్రయించి ఉంటుందని, శ్రీహరి సూర్యనారాయణుడిగా లోకైక క్రాంతిర్మయుడిగా దివ్యంగా వెలుగొందే అపరాహ్ణ కాలంలో రక్షను ధరించాలని కూర్మపురాణం విశదపరిచింది.