తెలంగాణలోని ఓ పార్టీ భాజపాకు మద్దతుగా పనిచేస్తోందని.. ఆ పార్టీని రాష్ట్రం దాటనీయొద్దని సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ టికాయత్ అన్నారు. హైదరాబాద్ ధర్నాచౌక్‌లో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాకు రాకేశ్‌టికాయత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దిల్లీ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు ఒక్కొక్కరి 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామన్న సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న టికాయత్.. ముందుగా తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు పరిహారం చెల్లించాలని సూచించారు. కేంద్రంలో భాజపాతో తెరాస కుమ్ముక్కైందన్నారు. తెలంగాణ సీఎం చెప్పేదొకటి చేసేదొకటని తీవ్ర విమర్శలు చేశారు.
అప్పటి వరకు ఇళ్లకు వెళ్లేది లేదు..
"సాగు చట్టాల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, కనీస మద్దతు ధరల చట్టం కోసం సాగుతున్న రైతు ఉద్యమంలో అమరులైన రైతులు.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులతో సమానం. ఆ అమరవీరులను ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు. మేం ఉద్యమకారులం... మా పోరాటం రోడ్లపైనే... ఎన్నికల్లో కాదు. రైతాంగ సమస్యలకు సంబంధించి ఎస్‌కేఎం, ఏఐకేఎస్‌సీసీ నాలుగు డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టిన నేపథ్యంలో మూడు సాగు చట్టాలు రద్దు స్వాగతిస్తున్నామని ప్రకటించారు. విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి బేషరతుగా తీసుకోవాలి, కనీస మద్ధతు ధరల చట్టం ప్రవేశపెట్టి అన్నదాతకు భరోసా ఇవ్వాలి, దిల్లీ ఉద్యమంలో చనిపోయిన బాధిత రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. డిమాండ్లు కేంద్రం పరిష్కరించేంత వరకు రైతు ఉద్యమం కొనసాగుతుంది. అప్పటి వరకు దిల్లీ సరిహద్దుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేది లేదు. మేమంతా సంఘటితంగా ఉన్నాం. చీలికలు తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నెల 27న దిల్లీలో జరగనున్న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం" - రాకేష్ టికాయత్, సంయుక్త కిసాన్ మోర్చా నేత