రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహం వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరింది. భారీ బందోబస్తు నడుమ పోలీసులు మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మరికాసేపట్లో రాజు మృతదేహానికి వైద్యులు శవ పరీక్షలు నిర్వహించనున్నారు అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. రాజు కుటుంబ సభ్యులు, బంధువులకు పోలీసులు సమాచారమందించగా.. మృతదేహాన్ని చూసేందుకు వారు ఇష్టపడడం లేదని పోలీసులు వెల్లడించారు. మృతదేహం మార్చురీకి చేరుకోగానే పోలీసులు గేట్లను మూసివేశారు. మార్చురీకి చేరుకున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు.
ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలోని నష్కల్ రైల్వే స్టేషన్ వద్ద రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎడమచేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడింది రాజేనని పోలీసులు నిర్ధరించారు. అత్యాచార నిందితుడు రాజు ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరిహద్దులోనూ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రాజు కోసం రైల్వే ట్రాక్‌లపై గాలించిన పోలీసులు... రైలు ప్రమాదఘటనల్లో గుర్తుతెలియని మృతుల వివరాలు పరిశీలించారు. అనంతరం మార్చురీల్లో భద్రపరిచిన రైలు ప్రమాద మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గాలింపు ముమ్మరం కావడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో... అతడి ఫోటోలు విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆత్మహత్య చేసుకుంటాడనని పోలీసులు అనుమానించారు. ఈ తరుణంలోనే స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్ వద్ద రాజు మృతదేహం లభ్యమైంది.
ఆచూకీ కనిపెట్టేందుకు..
అంతకుముందు రాజు ఆచూకీ కనిపెట్టేందుకు... ఆటోలు, రైళ్లు, బస్సులు ఇలా ప్రతి చోట...మూడు కమిషనరేట్ల పరిధిలోని... వెయ్యి మందికిపైగా పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ నెల 9న సైదారాబాద్‌లో చిన్నారిని చిదిమేసిన రాజు.. వారం రోజులుగా తప్పించుకొని తిరిగాడు. స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగి.. నేరుగా గాలింపు చర్యలు పర్యవేక్షించారు. ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో నిందితుడు సంచరించాడనే అనుమానంతో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌ను అప్రమత్తం చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. రహదారులు, వీధులతో పాటు కాలనీల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు.
ప్రత్యేక నిఘా
ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్సై ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు సైతం కూడళ్ల వద్ద నిఘా పెట్టారు. రైళ్లు, బస్సులు, ఆటోలపై పోస్టర్లు అంటించారు జనసమర్థ ప్రాంతాల్లో ప్రజలకు రాజు చేసిన నేరం గురించి వివరిస్తూ ఆచూకీ చెప్పాలని పోలీసులు ప్రచారం చేశారు. వరంగల్‌లో జరిగిన చిన్నారి హత్యాచార ఘటనలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించిందని సైదాబాద్ ఘటనలోనూ చట్టపరంగా కఠిన శిక్షపడేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ తరుణంలో రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలోనూ రాజుపై కేసు..
నిందితుడు రాజుపై గతంలోనూ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆటోను దొంగిలించిన కేసులో గతేడాది అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చాడు. రాజుకు తండ్రి లేకపోవడంతో తల్లి కూలీ పనులు చేస్తూ కొడుకును పోషించింది. కేవలం 3వ తరగతి వరకే చదివిన రాజు ఎక్కువగా హైదరాబాద్‌లో ఉంటాడని దర్యాప్తులో తేలింది. అప్పుడప్పుడు సొంతగ్రామమైన జనగామ జిల్లా కొడకొండ్లకు వెళ్లొస్తుంటాడని చుట్టుపక్కల వారు పోలీసులకు వివరించారు. లేబర్ అడ్డాల్లోనూ రాజు ఒకరిద్దరితోనే మాట్లాడతాడని.. వాళ్లతో కలిసి కూలీ పనిచేయగా వచ్చే సొమ్మును పంచుకుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి:LIVE UPDATES: చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్