ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన తరగతి గదిలో మైనర్ల వివాహ వీడియోపై.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. ఈ వీడియో గత నెల 17న ఉదయం 8.30 గంటలకు తీసిందని వెల్లడించారు. టిక్‌టాక్ తరహా ప్రాంక్ వీడియో తీసుకునేందుకు ఇరువురు విద్యార్థులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు.
నవంబర్ 2 నుంచి కళాశాలలు ప్రారంభం కాగా.. బాల బాలికలను వేర్వేరుగా కూర్చోపెడుతున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కళాశాల పనివేళలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.00 కాగా.. ఈ ఘటన ఉదయం 8.30కు జరిగినట్లు వివరించారు. ఆ సమయంలో ఇతర విద్యార్థులు, సిబ్బంది ఎవరూ లేకపోవడం వల్ల.. విషయం తమ దృష్టికి రాలేదన్నారు. విషయం తెలిసిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలిపారు.