తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాజ్​భవన్, ప్రగతి భవన్.. కలిసి రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తాయి' - గవర్నర్ తమిళిసై వార్తలు

కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో కొంత వెనకబడినప్పటికీ.. ఇప్పుడు సమర్థంగా పనిచేస్తోందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ ఆరు నెలల నుంచి ఏడాదిలో రావచ్చని.. అది తెలంగాణ నుంచే రావాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్​ పథకంలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల డయాగ్నసిస్ పూర్తయిందని.. చికిత్స చేయాల్సి ఉందన్నారు. గవర్నర్​గా ఏడాది పూర్తి చేసుకున్న తమిళిసై.. తనది రాజ్ భవన్ కాదని.. ప్రజాభవన్ అని అభివర్ణించారు.

governor tamilisai
governor tamilisai

By

Published : Sep 9, 2020, 5:44 PM IST

గవర్నర్​గా తమిళిసై ఏడాది పూర్తి చేసుకున్నారు. సంప్రదాయాలు, ప్రేమాభిమానాలకు నెలవైన తెలంగాణకు గవర్నర్​గా చేయడం తన అదృష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల త్యాగాలు మరవలేనివని.. తనను ఆదరిస్తున్న రాష్ట్ర ప్రజలకు సెల్యూట్ అన్నారు. తాను తమిళ పుత్రిక.. తెలంగాణ సోదరినన్న గవర్నర్ తమిళిసై.. తనది రాజ్ భవన్ కాదని.. ప్రజా భవన్ అని అభివర్ణించారు. రాజ్ భవన్.. ప్రగతి భవన్ కలిసి రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తాయన్నారు.

బాధ్యతలు తెలుసు

రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో.. ప్రభుత్వం తీరు గతంతో పోలిస్తే మెరుగుపడిందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ బాధ్యతలేంటో.. గవర్నర్ బాధ్యతలేంటో తనకు తెలుసన్నారు. మొదట్లో కొన్ని లోపాలు కనిపించడంతో.. ఓ వైద్యురాలిగా ఆందోళన చెంది ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు ఆమె తెలిపారు. పరీక్షలు పెంచాలని.. మొబైల్ ల్యాబ్​లు ఏర్పాటు చేయాలని.. జిల్లాల్లోనూ కొవిడ్ ఆస్పత్రులు ఉండాలన్న తదితర సూచనలను ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని అమలు చేసిందన్నారు. ప్రభుత్వానికి కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఉంటాయని.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.

తెలంగాణ నుంచే రావాలి

కరోనా వ్యాక్సిన్ రావడానికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు పట్టొచ్చునని అంచనా వేసిన గవర్నర్ తమిళిసై.. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం సీసీఎంబీ, భారత్ బయోటెక్ వంటి సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నందున.. తెలంగాణ నుంచే రావాలని ఆశిస్తున్నాని. కరోనాను పూర్తిగా నిర్మూలించలేమని.. జాగ్రత్తలతో కలిసి జీవించడం నేర్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్​ పథకంలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సూచించారు.

చికిత్స చేయాల్సి ఉంది

గవర్నర్​గా ఏడాది కాలంలో వైద్య, విద్య, గిరిజన అంశాలపై ఎక్కువగా పనిచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీ వర్గాలతో సుదీర్ఘంగా చర్చించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. వీసీలు, ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎంను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. యూనివర్సిటీ డయాగ్నసిస్ పూర్తయిందని.. చికిత్స చేయాల్సి ఉందన్న గవర్నర్.. రాష్ట్ర విశ్వవిద్యాలయాలను దేశంలో అత్యున్నత స్థానంలో నిలపాలన్నది తన ఉద్దేశమన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రైవేట్ ఉపాధ్యాయులు బ్లాక్ డేగా పాటించడం బాధాకరమని.. తొలగించిన ప్రైవేట్ ఉపాధ్యాయలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న గవర్నర్.. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు.

రాజ్​భవన్ వెబ్​సైట్ ఆవిష్కరణ

రాజ్ భవన్ కొత్త వెబ్ సైట్​ను గవర్నర్ తమిళిసై ప్రారంబించారు. వెబ్ సైట్ ద్వారా అపాయింట్​మెంట్ తీసుకోవచ్చునని.. ఫిర్యాదులు, సూచనలు పంపవచ్చునన్నారు. విశ్వవిద్యాలయాల పూర్వవిద్యార్థులు ఏకతాటిపైకి తెచ్చేందుకు ఛాన్సులర్ కనెక్ట్స్ అల్యూమిని పేరుతో మరో వెబ్ సైట్​ను కూడా ఆమె ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు తోడ్పడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details