Raithu Bandu News: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తొమ్మిదో విడత రైతుబంధు నగదు పంపిణీకి అంతా సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ కానుంది. గతంలో మాదిరిగానే రోజుకో ఎకరా చొప్పున పెంచుతూ ఆరోహణ క్రమంలో నగదు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 68లక్షల 94వేల మంది రైతులకు చెందిన కోటి 51 లక్షల 11 వేల ఎకరాలకు సంబంధించి 7వేల 654 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు.
తొలిరోజు ఎకరాలోపు పొలం కలిగిన 19లక్షల 98 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 586కోట్లు జమ చేయనున్నారు. వానా కాలం ఆరంభమై 28 రోజులు గడుస్తుండటంతో సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలో రైతుబంధు నగదు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో అర్హులైన రైతుల వివరాలు ఇప్పటికే భూపరిపాలన శాఖ – సీసీఎల్ఏ వ్యవసాయ శాఖకు అందజేసింది.
రైతుబంధు ద్వారా ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు సర్కారు 50వేల 447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో ప్రభుత్వం 14వేల800 కోట్లు కేటాయించింది. గత ఏడాది వానా కాలంలో 60లక్షల 84 వేల మంది రైతులకు 7వేల 360కోట్లు రైతుబంధు సాయం అందించింది. గడచిన యాసంగి సీజన్‌లో 63 లక్షల మంది రైతులకు 7వేల 412 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం పంపిణీ చేశారు. ఈ సారి కొత్త లబ్ధిదారులకు అవకాశం ఇవ్వడంతో సాయం అందించే వారి సంఖ్య పెరిగింది.
ఈ సీజన్‌లో 68లక్షల 94వేల మందికి రైతుబంధు నగదు అందనుంది. మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు. రైతు పేరు, గ్రామం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు శాఖ, ఖాతా నంబరు వంటి వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి: